: ఫిలిప్పీన్స్ కేసినోలో దుండగుడి కలకలం.. కాల్పులు, తొక్కిసలాట.. ఉగ్రదాడి కాదన్న పోలీసులు
ఫిలిప్పీన్స్‌లోని ఓ హోటల్-కేసినో కాంప్లెక్స్‌లో ముసుగు ధరించిన దుండగుడు బీభత్సం సృష్టించాడు. శుక్రవారం తెల్లవారుజామున మనీలాలోని డేలా రోసాలో ఈ ఘటన జరిగింది. లోపలికి ప్రవేశించిన ఆగంతుకుడు టీవీ స్క్రీన్లపై కాల్పులు జరిపాడు. గ్యాంబ్లింగ్ టేబుళ్లకు మంటపెట్టాడు. వెంట తెచ్చుకున్న బ్యాగులో కేసినో చిప్స్ వేసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపాడు. అయితే అతడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
మరోపక్క, ఏం జరుగుతోందో తెలియక ప్రజలు భయంతో పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. 70 మందికిపైగా గాయపడ్డారు. ఇది ఉగ్రవాద సంస్థ ఐసిస్ పనేనని అందరూ భావించారు. అయితే అటువంటిదేమీ లేదని, అతడు దోపిడీ కోసమే వచ్చాడని పోలీసులు తేల్చి చెప్పారు. ఒకవేళ అతడు ఉగ్రవాదే అయితే కేసినోలో ఉన్న అందరినీ కాల్చి చంపేవాడని, కానీ అతడు ఎవరికీ హానీ తలపెట్టలేదని పేర్కొన్నారు. నిందితుడి కోసం వేట ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.