: టీడీపీ, బీజేపీలపై విష ప్రచారం జరుగుతోంది.. ఎవరూ నమ్మొద్దు: వెంకయ్య
తెలుగుదేశం, బీజేపీల స్నేహం గురించి విష ప్రచారం జరుగుతోందని... దాన్ని ఎవరూ నమ్మవద్దని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రెండు పార్టీలు కలిసే పని చేస్తాయని చెప్పారు. ఏపీకి రూ. 2.30 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించామని... దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ప్రకాశం జిల్లా రామాయపట్నం పోర్టు ఏర్పాటుకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చిస్తామని అన్నారు. శాశ్వతమైన అభివృద్ధి కోసం ప్రయత్నించాలని చెప్పారు. రంజాన్ తోఫాలు, సంక్రాంతి కానుకలు ప్రజలకు ఉపయోగపడవని అన్నారు.
గోవధ గురించి కొందరు పనిగట్టుకుని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వెంకయ్యనాయుడు అన్నారు. పశు ఆహారాన్ని తినవద్దని తాము చెప్పలేదని... వ్యవసాయానికి ఉపయోగపడే పశువులను కబేళాలకు పంపించవద్దనేది మాత్రమే కేంద్ర ప్రభుత్వ విధానమని చెప్పారు. గోవధపై దేశవ్యాప్తంగా వచ్చిన అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని వెల్లడించారు.