: రజనీకి జై కొడుతున్న కొందరు ఎమ్మెల్యేలు... అన్నా డీఎంకే పార్టీలో కలకలం!
తమిళనాడులో అధికార పార్టీ అయిన అన్నాడీఎంకేలో కలకలం రేగుతోంది. ఎప్పుడేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీనికంతటికీ కారణం సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీ తన రాజకీయ పార్టీని అధికారికంగా ప్రారంభించిన వెంటనే... అతని అడుగుజాడల్లో నడిచేందుకు ఇప్పటికే ఐదుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారనే వార్తలు తమిళ రాజకీయాల్లో అలజడి రేపుతున్నాయి.
ఇంకా రజనీ పార్టీలో చేరేందుకు పలువురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారట. అయితే వీరంతా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. సమయం రాగానే జంప్ చేసేందుకు మాత్రం రెడీగా ఉన్నారట. పన్నీర్ సెల్వం, పళనిస్వామిల వర్గాలకు చెందిన పలువురు కార్యనిర్వాహకులు కూడా రజనీ పార్టీ కోసం ఎదురు చూస్తున్నారట. దీంతో, అన్నాడీఎంకేలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.
మరోవైపు డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు కూడా రజనీతో సంప్రదింపులు జరిపేందుకు ఆసక్తి చూపుతున్నారని సమాచారం. అయితే తన కొత్త చిత్రం షూటింగ్ లో ముంబైలో బిజీగా ఉన్న రజనీకాంత్... వీరెవరితోనూ ఇప్పుడు కలవడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదట. ఇప్పుటికే పలువురు సినీ ప్రముఖులు రజనీకి తమ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.