: దాసరి వ్యక్తి కాదు వ్యవస్థ... ఉన్నత శిఖరాలను అధిరోహించారు!: చంద్రబాబు
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాదులోని ఫిల్మ్ ఛాంబర్ కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, మంత్రి చినరాజప్ప, ఇతర మంత్రులు, తెలంగాణ టీడీపీ నేతలతో కలసి వచ్చిన ఆయన... దాసరి భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాసరి నారాయణరావు వ్యక్తి కాదు వ్యవస్థ అన్నారు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, రాజకీయవేత్తగా దాసరి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారని తెలిపారు.
దాసరి మరణం కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రమే కాదని, యావత్ తెలుగు జాతికి తీరని లోటని అన్నారు. దాసరితో తనకు చిన్నప్పటి నుంచి పరిచయం ఉందని ఆయన చెప్పారు. ఆయన తమ కుటుంబానికి సన్నిహితుడని తెలిపారు. సినీ పరిశ్రమ కార్మికుల కోసం దాసరి చాలా కష్టపడి పని చేశారని చెప్పారు. సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన బడుగు, బలహీన వర్గాల కష్టాల నిర్మూలనకు పని చేశారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.