: కారు కొంటే సెల్ ఫోన్ ఉచితం అన్నారు.. చివరికి రెండు ఆలుగడ్డలు పంపారు!
తమ షో రూంలో కారు కొని లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి శాంసంగ్ ఫోనును ఉచితంగా ఇస్తామని చెప్పిన ఓ షోరూం ఆ విన్నర్‌కి సెల్‌ఫోనుకు బదులుగా రెండు ఆలుగడ్డలు పంపించిన ఘటన ఒడిశాలోని రఘునాథ్‌పూర్‌లో చోటుచేసుకుంది. దీంతో ఆ వ్యక్తి ఆ ఆలుగడ్డలను తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఓ షోరూంపై ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది.
వివరాల్లోకి వెళితే, హర్షవర్ధన్ అనే వ్యక్తి ఇటీవల స్థానిక స్కై ఆటోమొబైల్స్‌లో మారుతి ఆల్టో కారు కొనగా అనంతరం తీసిన లక్కీ డ్రాలో ఆయన పేరే వచ్చింది. శాంసంగ్ ఫోనును త్వరలోనే పంపిస్తామని చెప్పిన షోరూం యాజమాన్యం రెండురోజుల తర్వాత ఆయనకు ఫోన్ చేసి కొరియర్ ఆఫీస్‌కి గిఫ్ట్ పంపామని వెళ్లి తీసుకోవాలని చెప్పింది. ఎంతో సంతోషంగా అక్కడకు వెళ్లిన హర్షవర్ధన్ గిఫ్ట్ తీసుకొని దాన్ని ఓపెన్ చేసి చూశాడు. అంతే, అందులో రెండు ఆలుగడ్డలు కనిపించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.