: బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న విపక్షాలు.. ఆర్జేడీ ర్యాలీలో పాల్గొనాలని మాయావతి నిర్ణయం
ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ ఆగస్టులో పాట్నాలో నిర్వహించనున్న ర్యాలీలో పాల్గొనేందుకు విపక్ష పార్టీలు ఒక్కొక్కటిగా ముందుకొస్తున్నాయి. ఇప్పటికే మమతా బెనర్జీ ఆర్జేడీ అధినేతకు గట్టి మద్దతు పలకగా బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఆమె బాటలోనే పయనిస్తున్నారు. పట్నాలో ఆగస్టు 27న నిర్వహించనున్న బీజేపీ వ్యతిరేక ర్యాలీలో పాల్గొనాలని నిర్ణయించారు. బీజేపీపై ఒంటరిగా పోరాడడంలో అర్థం లేదని భావించిన మాయావతి గ్రాండ్ అపోజిషన్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
సోమవారం విపక్ష పార్టీలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చిన విందులో 17 విపక్ష పార్టీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా లాలుప్రసాద్ మాట్లాడుతూ ఎన్‌డీఏను వ్యతిరేకించేవారు తాను చేపట్టబోయే ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దీంతో ఒక్కొక్కరుగా ఆర్జేడీకి మద్దతు తెలుపుతున్నారు. కాగా, సోనియా గాంధీ ఇచ్చిన విందు సందర్భంగా రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చకు వచ్చింది. ప్రతిపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించారు. అయితే అభ్యర్థి పేరు మాత్రం ఇప్పటి వరకు ఖరారు కాలేదు.