: విశాఖపట్నంలో సింహాద్రి అప్పన్న సాక్షిగా ఈ రోజు ప్రమాణం చేశా: మహానాడు ముగింపు ప్రసంగంలో చంద్రబాబు
విశాఖపట్నం వేదికగా శనివారం ప్రారంభమైన టీడీపీ మహానాడు కాసేపట్లో ముగియనుంది. ఈ సందర్భంగా టీడీపీ జాతీయాధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముగింపు ప్రసంగం చేస్తున్నారు. మహానాడుని టీడీపీ కార్యకర్తలు, నేతలు ఓ పండుగగా జరిపారని అభినందించారు. విశాఖపట్నంలో సింహాద్రి అప్పన్న సాక్షిగా ఈ రోజు టీడీపీ జాతీయాధ్యక్షుడిగా ప్రమాణం చేశానని అన్నారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలన్నదే తమ పార్టీ లక్ష్యమని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఫేజ్-1 ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రూ.2 వేల కోట్లతో ఏడాదిలోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. 2018లోగా 1,30,866 ఎకరాలకు నీరందిస్తామని తెలిపారు.
తమ పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్న టీడీపీ కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నానని చంద్రబాబు అన్నారు. ప్రజల కోసం స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఆనాడు హైదరాబాద్‌ని అద్భుతంగా తీర్చిదిద్దామని అన్నారు. ఇప్పుడు అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు. టీడీపీకి మహానాడు కొత్త కాదని, ఎన్నో మహానాడులను నిర్వహించామని, రాబోయే ఏడాది ఏం చేయబోతామో, దాని కార్యాచరణ ఎలాగుండాలో మహానాడులో నిర్ణయాలు వెల్లడిస్తామని తెలిపారు. మహానాడులో మొత్తం 34 తీర్మానాలు ప్రవేశపెట్టగా, 94 మంది ప్రసంగించారని చెప్పారు.