: మహానాడు వేదికపైనే.. నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు!
తెలుగుదేశం పార్టీ నేతలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు మహానాడు వేదికపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై నేతలు గ్రూప్ మీటింగులు పెడుతున్నారని... ఇది సరికాదని అన్నారు. తెలుగుదేశం పార్టీలో సమస్య కార్యకర్తలతో కాదని, నాయకులతోనే అని మండిపడ్డారు. పలు ప్రాంతాల్లో నేతలు గ్రూపులను తయారు చేసుకుంటున్నారని... అలాంటి వారి జాబితా తన వద్ద ఉందని చెప్పారు. నాయకులు గ్రూపు రాజకీయాలు చేస్తే, కార్యకర్తలు మరో దారి చూసుకుంటారని... అలాంటి పరిస్థితి తీసుకురావద్దని సూచించారు. గ్రూపు రాజకీయాలు చేసే వారిని ఉపేక్షించబోనని హెచ్చరించారు. ఆ రోజుల్లో పెద్దవారి ప్రసంగాలను తాము గంటల తరబడి కూర్చొని వినేవాళ్లమని... ఆ అలవాటు ఇప్పుడున్న చాలామంది నేతల్లో కొరవడుతోందని అసహనం వ్యక్తం చేశారు. అన్ని విషయాలపైన నాయకులు అవగాహన పెంచుకోవాలని చెప్పారు.