: నరేష్, స్వాతిలను రప్పించిన ఎస్సై ఫోన్ కాల్ వాట్స్ యాప్ లో వైరల్!
తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన 'భువనగిరి విషాదాంత ప్రేమకథ'లో నరేశ్ హత్యోదంతానికి సంబంధించి పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తుండగా, తాజాగా ఆత్మకూరు ఎస్సై శివనాగప్రసాద్ స్వాతితో ఫోన్ లో మాట్లాడిన సంభాషణలు సామాజిక మాధ్యమం వాట్స్ యాప్ లో వైరల్ అవుతున్నాయి. నరేష్ ను హత్య చేశానని స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి అంగీకరించిన తరువాత ఈ సంభాషణ వెలుగు చూడడంతో ఇది వైరల్ గా మారింది.
స్వాతి ముంబై వెళ్లి నరేష్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం పంచాయతీ జరిగిన తరువాత మరోసారి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఆమె తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో... ఎస్సై శివనాగప్రసాద్ ‘మిస్సింగ్’ కేసు నమోదు చేశారు. అనంతరం నరేశ్ చిన్నాన్నతోపాటు మరికొందరిని స్టేషన్ కి పిలిపించి విచారించారు.
ఈ సందర్భంగా స్వాతితో ఫోన్ లో ఎస్సై మాట్లాడుతూ, ‘మీరు రావాల్సిందే.. లేకపోతే వీళ్ల పని ఇక్కడ అయితది... భువనగిరిలో డీఎస్పీ ఆఫీస్ ఉంటది. నువ్వు డైరెక్ట్ గా ఆడికి వచ్చి ‘మేం బతికే ఉన్నాం సార్’ అని చెప్పి అటునుంచి అటే వెళ్లిపోవచ్చు, లేకుంటే ఇక్కడ వీళ్లకు ఇబ్బందైతది’ అన్నారు. ఈ సంభాషణ ఎలా లీకైందో గానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పోలీసు అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి!