: కేసీఆర్ ఓ దిక్కుమాలిన సర్వే తెస్తే నమ్ముతారా?: మహానాడులో సండ్ర
ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తమ పార్టీ 111 సీట్లు గెలుస్తుందని కేసీఆర్ స్వయంగా రాసుకొచ్చిన ఓ దిక్కుమాలిన సర్వేను నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరని తెలంగాణ తెలుగుదేశం నేత, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఎద్దేవా చేశారు. ఈ ఉదయం మహానాడు వేదికపై మాట్లాడిన ఆయన, సర్వే నిజమని కేసీఆర్ భావిస్తే, తక్షణమే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ కు ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లే దమ్ము, ధైర్యం ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. తప్పుడు సర్వేతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల పనితీరును ఏ ప్రాతిపదికన సర్వే చేయించారో ఆయన బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రకటించిన సర్వే ఫలితాలను ప్రజలు ఇప్పటికే చెత్త బుట్టలో పడేశారని అన్నారు. ఎర్రబెల్లి దయాకర్ ఓ ఊసరవెల్లి లాంటోడని, మాగంటి గోపీనాథ్, గాంధీలు బ్రోకర్లని అభివర్ణించారు.