: మాజీ పనివాడికి రూ. 26 కోట్ల కాంట్రాక్టు ఇప్పించి 'పవర్' చూపిన పంజాబ్ మంత్రి
అక్రమ ఇసుక తవ్వకాలపై ఉక్కుపాదం మోపుతూ, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఇసుక మైనింగ్ లైసెన్స్ లను జారీ చేసేందుకు వేలం నిర్వహించగా, అందులోనూ అమాత్యులు తమ పవర్ చూపించారు. ఈ వేలంతో గత సంవత్సరం ఇసుక తవ్వకాలతో పోలిస్తే 20 రెట్లు అధికంగా రూ. 1000 కోట్ల వరకూ ఆదాయం రాగా, విద్యుత్ శాఖ మంత్రి రానా గుర్జీత్ సింగ్ తో సంబంధమున్న నలుగురికి కీలక గనులు దక్కాయి.
వీరిలో గుర్జీత్ ఇంట పని చేసిన మాజీ పనివాడు అమిత్ బహదూర్ కూడా ఉన్నాడు. అతనికి నవాన్ షహర్ జిల్లాలో రూ. 26.5 కోట్ల విలువైన మైనింగ్ గనులు దక్కాయి. గత ఎన్నికల్లో పంజాబ్ లో బరిలోకి దిగిన వారిలో అత్యధిక ధనవంతుడిగా గుర్జీత్ నిలిచారు. ఇక ఆయన ఇంట్లో పని చేసిన బహదూర్ వార్షికాదాయం 2014-15లో రూ. 75,390, 2015-16వూ స. 92,679 మాత్రమే కాగా, ఏప్రిల్ 1 నాటికి అతని బ్యాంకు బ్యాలెన్స్ 4,840 మాత్రమే. అమిత్ మాదిరిగానే, అతని వద్ద పనిచేసే మాజీ ఉద్యోగి కుల్వీందర్ పాల్ సింగ్ రూ. 9.21 కోట్ల బిడ్ వేసి ఓ గనిని దక్కించుకున్నాడు. వారు గతంలో తన వద్ద పనిచేసిన వారే తప్ప, ఇప్పుడు వారితో తనకు సంబంధాలు లేవని గుర్జీత్ చెబుతుండటం గమనార్హం. ఇలా గనులను పొందిన వారిలో ఎంతో మంది అమాత్యుల దగ్గరి వారుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.