: నీ చొక్కా గుంజుతా.. లాగు గుంజుతా అంటే ‘నీ గొంతు పట్టుకుంటా బిడ్డా’ అంటున్నా: కేసీఆర్
తమకు కేంద్ర ప్రభుత్వంతో వైరం ఏమీ లేదని, అయితే, ‘అధికార పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇక్కడకు వచ్చి నీ చొక్కా గుంజతా.. లాగు గుంజుతా అంటే ఊరుకుంటానా, నీ గొంతు పట్టుకుంటా బిడ్డా అంటున్నా’నని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. అమిత్ షా ఇలాంటి చిలిపి పనులు మానుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు. సహనానికి కూడా హద్దులు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ పవర్, పదవి తనకు ఒక్క లెక్క కాదని, తెలంగాణ బాగోగులే ముఖ్యమని అన్నారు. తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని, గిట్టుబాటు ధర వచ్చేంతవరకు రైతు సమాఖ్యలు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నామని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే బీజేపీ సత్తా ఏంటో తేలిపోయందని అన్నారు. తమ ఎమ్మెల్యేలు 30 మంది బీజేపీలో చేరతారంటూ బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇంతకన్నా పెద్ద జోక్ ఇంకేమైనా ఉంటుందా? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తే ప్రజలు వాటిని నమ్మడానికి సిద్ధంగా లేరని అన్నారు.