: జూన్ లో జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను రద్దు చేసిన ఎలక్షన్ కమిషన్
జూన్ 8న పశ్చిమ బెంగాల్, గుజరాత్, గోవాల్లోని 10 రాజ్యసభ స్థానాలకు జరగాల్సిన ఎన్నికలను రద్దు చేస్తున్నట్ట ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. వచ్చే నెల 3 నుంచి ఈవీఎంల విశ్వసనీయతపై సవాలును ప్రకటించి ఉన్నందున, అది తేలిన తరువాతనే ముందుకెళ్లాలన్న ఆలోచనతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొత్త తేదీలను తదుపరి ప్రకటిస్తామని, మూడు రాష్ట్రాల్లో ఖాళీకానున్న రాజ్యసభ స్థానాల ఎన్నికలపై ఈ నెల 16వ తేదీన ఇచ్చిన ప్రకటనను ఉపసంహరించుకుంటున్నామని ఈసీ వెల్లడించింది. కాగా, జూలై, ఆగస్టు నెలల్లో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ సహా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఓ బ్రిన్ తదితరుల పదవీ కాలం ముగియనుంది. తృణమూల్ నుంచి నలుగురు, కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ఒకరు రిటైర్ కానుండగా, వారి స్థానాల్లో కొత్త సభ్యులను ఎన్నుకోవాల్సి వుంది.