: జగన్ తో బీజేపీ పొత్తు... వెంకయ్య వ్యాఖ్యల అంతరార్థం ఇదేనా?
రానున్న ఎన్నికలు 2019లో జరుగుతాయా? లేక ముందస్తుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? అనేది ప్రస్తుతం రాజకీయ నేతల నుంచి సామాన్యుడి వరకు వేధిస్తున్న ప్రశ్న. ఏం జరగబోతోంది? అనే విషయం ఎవరి అంచనాలకూ అందడం లేదు. ఏదైనా జరిగే అవకాశం ఉండటంతో... సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు ఈ ప్రశ్న అందరినీ వేధిస్తుండగా... తదుపరి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీల మైత్రి కొనసాగుతుందా? లేదా? అనే కొత్త ప్రశ్న కూడా తలెత్తుతోంది. కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడి వ్యాఖ్యలు ఈ ఉత్కంఠను మరింత పెంచేలా చేస్తున్నాయి.
ప్రస్తుతానికైతే ఏపీలో టీడీపీతో పొత్తు కొనసాగుతోందని... 2019 ఎన్నికల నాటికి పొత్తు ఎవరితో పెట్టుకోవాలి? అనే విషయంపై ఆలోచిస్తామని వెంకయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలే ఎండ తీవ్రతకు మాడి మసైపోతున్న ఏపీలో వెంకయ్య వ్యాఖ్యలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి. మోదీతో జగన్ భేటీ ఈ రెండు పార్టీల మధ్యకు దారి తీస్తుందా? అనే కోణంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నెల 25న విజయవాడలో జరగనున్న కార్యకర్తల సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతారని వెంకయ్య తెలిపారు. ఐక్యరాజ్యసమితి ఆవాస అధ్యక్షుడిగా వెంకయ్య ఎపికైన సందర్భంగా విజయవాడలో నేడు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, వెంకయ్య పైవ్యాఖ్యలు చేశారు.