: మమతాబెనర్జీనే బెస్ట్... పొగడ్తలు కురిపించిన రాష్ట్రపతి
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు కురిపించారు. సమర్థవంతమైన పాలనను మమత అందిస్తోందని కితాబిచ్చారు. ఆరోగ్యం, విద్య తదితర రంగాల్లో మమత ప్రభుత్వం అద్భుతమైన ప్రతిభను కనబరుస్తోందని అన్నారు. వైద్య ఖర్చులను సామాన్యుడు భరించలేని స్థితిలో ఉన్నాడంటూ ఆరోపణలు వెల్లువెత్తిన వెంటనే మమత చాలా వేగంగా చర్యలు తీసుకున్నారని ప్రశంసించారు.
గత 50 ఏళ్లుగా పశ్చిమబెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో తాను ఉన్నానని... రాష్ట్రపతి అయ్యాక కూడా తాను చాలా సార్లు రాష్ట్రానికి వచ్చానని... తాను చూసిన గత ప్రభుత్వాల కంటే మమత ప్రభుత్వమే మెరుగైన పాలన అందిస్తోందని చెప్పారు. వయసులో తన కంటే చిన్నదైన మమతను తాను ఆశీర్వదిస్తున్నానని తెలిపారు. ఎలాంటి చింత లేకుండా ముందుకు వెళ్లండి... ఆ భగవంతుడే మీకు సహాయం చేస్తాడు' అని మమతను రాష్ట్రపతి దీవించారు. కాలేయ వ్యాధుల కోసం ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ డైజెస్టివ్ సైన్సెస్ ను నిన్న రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మమత కూడా హజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.