: 18 ఏళ్ల తర్వాత మళ్లీ భంగపడిన పాక్.. దాయాది అభ్యంతరాలు బేఖాతర్ చేసిన ఐసీజే


భారత్‌పై భంగపడడం పాకిస్థాన్‌కు.. ఆ దేశంపై పైచేయి సాధించడం భారత్‌కు అలవాటుగా మారింది. భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయ స్థానంలో భారత్ ఘన విజయం సాధించింది. జాదవ్‌కు ఉరిశిక్షపై హేగ్‌లోని 11 మంది న్యాయమూర్తుల ధర్మాసనం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు జాదవ్‌కు ఉరిశిక్ష విధించరాదని పాక్‌ను ఆదేశించింది. ఈ కేసును విచారించే అధికారం అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)కు లేదన్న పాక్ వాదనను కొట్టిపడేసింది. వియన్నా ఒప్పందం ప్రకారం ఆ అధికారం తమకు ఉందని మొట్టికాయలు వేసింది. కాగా, ఐసీజేలో పాక్ ఇలా భారత్ చేతిలో భంగపడడం ఇది రెండోసారి.  

18 ఏళ్ల క్రితం అంటే 1999లో పాక్ వైమానిక దళానికి చెందిన అట్లాంటిక్ విమానం భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. గుజరాత్‌లోని కొరి క్రీక్‌ ప్రాంతంలో ఎగురుతున్న పాక్ విమానాన్ని భారత వైమానికదళం గుర్తించింది. వెంటనే కిందకు దిగాలని హెచ్చరించింది. ఆ హెచ్చరికలను పాక్ విమానం బేఖాతరు చేయడంతో భారత వాయుసేనకు చెందిన మిగ్ విమానం క్షిపణిని ప్రయోగించి దానిని నేల కూల్చింది. ఈ ఘటనలో 16 మంది పాక్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. విమానం కూలిన కోరి క్రీక్ ప్రాంతం భారత్‌లోనే ఉండడంతో గగనతల నిబంధనలు ఉల్లంఘించినందుకు పాక్ విమానాన్ని కూల్చివేయాల్సి వచ్చిందని భారత్ అప్పట్లో ప్రకటించింది. దీనిపై పాక్ ఐసీజేలో కేసు దాఖలు చేసింది. అయితే ఈ ఘటన అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకి రాదని భారత్ వాదించింది. భారత్ వాదనతో అంగీకరించిన న్యాయస్థానం కేసును కొట్టివేసింది. అలా భారత్ చేతిలో తొలిసారి భంగపడిన పాక్.. తాజాగా రెండోసారి ఐసీజే చేతిలో మొట్టికాయలు తింది.

  • Loading...

More Telugu News