: మమ్మల్ని తక్కువగా అంచనా వేయవద్దు: కిమ్ జాంగ్ ఉన్ కు దక్షిణకొరియా దౌత్యాధికారి
తమను తక్కువగా అంచనా వేయవద్దని దక్షిణకొరియా మీడియా అధికార ప్రతినిధి హంగ్ సీయోక్ హున్ ఉత్తరకొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ ను హెచ్చరించారు. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ట్రంప్ తో తమ దేశ దౌత్యాధికారులు సమావేశమైన అంశాలను వెల్లడించిన సందర్భంగా మాట్లాడుతూ, ఉత్తరకొరియా ఎలాంటి దుందుడుకు చర్యలు తీసుకున్నా వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
ప్రస్తుతం దక్షిణ కొరియాలో అమెరికాకు చెందిన 28,500 మంది సైనికులు ఉన్నారని వెల్లడించారు. అయితే అమెరికా సైనికుల అండను చూసుకుని తాము ఈ మాటలు చెప్పడం లేదని, తమ దేశాన్ని రక్షించుకోవడమెలాగో తమకు తెలుసని స్పష్టం చేశారు. తమను తక్కువ అంచనా వేస్తే ఫలితం చూస్తారని ఆయన చెప్పారు. కాగా, ఉత్తరకొరియా చీఫ్ కిమ్ జాంగ్ ఉన్ తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చలు జరిపే అవకాశం ఉందని, అందుకు తగిన సమయం కోసం అమెరికా వేచి చూస్తోందని ఆయన చెప్పారు. ప్రపంచ వినాశనానికి దారితీసే కిమ్ చర్యలు సరికాదని ఆయన హితవు పలికారు.