: ఆ ఐదు కంపెనీలు ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టాయి!
ఇన్వెస్టర్లకు భారీ లాభాలు పంచి, నాలుగేళ్లలో వారి పెట్టుబడుల విలువను సుమారు 80 రెట్లుకు చేర్చిన ఐదు కంపెనీల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఐదు కంపెనీల్లో అవంతి ఫీడ్స్, కాప్లిన్ పాయింట్ లాబ్స్, టేస్టీ బైట్ ఈటబుల్స్, యాస్ టెక్ లైఫ్ సైన్సెస్, ఇండో కౌంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ ఐదింటిలో ‘అవంతి ఫీడ్స్’ సంస్థ ఆంధ్రప్రదేశ్ కు చెందినది. ఆ కంపెనీల గురించి చెప్పాలంటే..
అవంతి ఫీడ్స్.. రొయ్యల దాణా, ప్రాసెస్డ్ రొయ్యలను ఎగుమతి చేస్తుంది. ప్రస్తుతం దేశంలోని చేపలు, రొయ్యల దాణా మార్కెట్లో నలభై శాతం వాటా ఈ సంస్థదే. నాలుగేళ్ల క్రితం ఇదే సమయంలో ఈ సంస్థ షేరు విలువ రూ.20.8 పలికింది. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు బీఎస్ఈలో నిన్న రూ.1,303.60 దగ్గర ముగియడం గమనార్హం. ఇంకా విశేషం ఏమిటంటే, గత మూడు రోజుల్లో ‘అవంతి ఫీడ్స్’ షేర్లు 50 శాతం పెరిగాయి.
టేస్టీ బైట్ ఈటబుల్స్.. మెక్ డొనాల్డ్స్, డొమినో పిజ్జాస్, సబ్ వే వంటి క్విక్ సర్వీస్ రెస్టారెంట్లకు ఈ కంపెనీ తయారు చేసిన సాస్ లు, శీతలీకరించిన ఆహారపదార్థాలు సరఫరా చేస్తుంది. ఈ కంపెనీ షేర్ల విషయానికొస్తే నాలుగేళ్ల క్రితం ఇదే సమయంలో దీని ధర రూ.178 ఉండేది. నిన్న బీఎస్ఈలో దీని షేర్లు రూ.5,651.65 వద్ద ముగిసింది. మరో ఆశ్చర్యకరమైన విషయమేమింటే, 2011-12 ఆర్థిక సంవత్సరంలో రూ.1.6 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ లాభాలు, 2016 నాటికి రూ.16 కోట్లకు చేరాయి.
కాప్లిన్ పాయింట్ లాబ్స్.. ఇది ఫార్మా కంపెనీ. గత ఐదేళ్లుగా ఈ కంపెనీ రాబడులు ఏటా సగటున 65 శాతం చొప్పున పెరుగుతున్నాయి. నాలుగేళ్ల క్రితం ఇదే సమయంలో రూ.13.40 పలికిన ఈ కంపెనీ షేర్లు ప్రస్తుతం రూ.535.25 దగ్గర ఉన్నాయి. అయితే..మిగతా ఫార్మా కంపెనీలకు భిన్నంగా లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలపై ఈ కంపెనీ దృష్టి పెట్టింది. అక్కడ పట్టుసాధించిన ‘కాప్లిన్’ ఇప్పుడు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించింది.
ఇండో కౌంట్ ఇండస్ట్రీస్... ఈ కంపెనీ మొదట హోమ్ టెక్స్ టైల్స్ ఎగుమతి రంగంలో ఉంది. 2008లో కరెన్సీ డెరివేటివ్స్ లోకి ప్రవేశించి నష్టాలు చవిచూసింది. 2013 వరకు నష్టాల బాటలోనే నడిచింది. ఆ తర్వాత క్రమక్రమంగా కోలుకుంది. ప్రస్తుతం రూ.194.15 స్థాయిలో ఉన్న దీని షేర్ ధర నాలుగేళ్ల క్రితం ఇదే సమయంలో రూ.2.40గా ఉంది. అయితే, ఇటీవల రూపాయి మారకం విలువ, పత్తి ధరలు పెరగడంతో కంపెనీని కొద్దిగా కుంగదీశాయి. అయినప్పటికీ, కొద్దిగా రిస్క్ తీసుకోగలిగితే, దీర్ఘకాలిక లాభాలకు అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకుల అంచనా.
యాస్ టెక్ లైఫ్ సైన్సెస్... వ్యవసాయ రసాయన మందులు తయారు చేసి సరఫరా చేసే కంపెనీ ఇది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలకు కాంట్రాక్ట్ పద్ధతిలో వీటిని సరఫరా చేస్తుంటుంది. మనదేశంలో తన సొంత బ్రాండ్ తో తన ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభించిన ఈ సంస్థ షేర్ ధర నాలుగేళ్ల క్రితం రూ.20. నిన్న బీఎస్ఈలో దీని షేరు ధర రూ.579.85 వద్ద ముగిసింది. ఈ షేర్లలో ఇప్పటికీ లాభాలకు అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషణ. 2011-12లో ఈ సంస్థ లాభాలు రూ.1.5 కోట్లు కాగా, ఈ ఏడాది మార్చి నాటికి దాని లాభాలు రూ.26 కోట్లకు చేరింది.