: శిక్ష అనుభవించిన తరువాత కూడా శిక్షించడమేంటి?: షరపోవాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ నిరాకరణపై మండిపడ్డ డబ్ల్యూటీఏ చీఫ్
15 నెలల నిషేధం అనంతరం ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పునఃప్రవేశం చేద్దామని భావించిన మాజీ నంబర్ వన్ మరియా షరపోవాకు వైల్డ్ కార్డ్ ఎంట్రీని నిర్వాహకులు నిరాకరించడంపై డబ్ల్యూటీఏ చీఫ్ స్టీవ్ సైమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. షరపోవాకు స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్డు (సీఏఎస్ ) విధించిన 15 నెలల శిక్ష ముగిసిన తరువాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ నిరాకరించి శిక్షించడమేంటని ఆయన ప్రశ్నించారు.
ఒక మాజీ చాంపియన్ ను ఇలా అవమానించడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. టెన్నిస్ క్రీడాకారులకు గ్రాండ్ స్లామ్, డబ్ల్యూటీఏ, ఐటీఎఫ్, ఏటీపీ సంస్థలు టెన్నిస్ యాంటి డోపింగ్ ప్రోగ్రామ్ (టీఏడీపీ) లో భాగస్వాములని, వాటి తరపునే క్రీడాకారులపై స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టు శిక్ష విధిస్తుందని ఆయన గుర్తు చేశారు. ఒకసారి శిక్షించిన తరువాత ఎంట్రీలు నిరాకరించి మరోసారి శిక్షించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, గాయపడ్డవారికి తప్ప డోపీలకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వలేమని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు తెలిపారు.