: కిమ్ కి తిక్కరేగి మిసైల్ వదిలితే... ట్రంప్ కు కేవలం పది నిమిషాల టైమ్ మాత్రమే వుంటుంది!: శాస్త్రవేత్తలు

అణుబాంబేస్తా... అణుబాంబేస్తా అంటూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అమెరికాపై కారాలు మిరియాలు నూరుతున్నాడు. అమెరికా అధ్యక్షుడు కూడా ఉత్తరకొరియాను మట్టుబెడతానని బెదిరింపులకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు డేవిడ్ రైట్, మార్కస్ చిల్లర్ స్పందిస్తూ, ఉత్తరకొరియా, అమెరికా మధ్య 5,500 మైళ్ల దూరం ఉంటుందని తెలిపారు. దీంతో ఉత్తరకొరియా, అమెరికాపై అణుక్షిపణిని ప్రయోగిస్తే... అది అక్కడి నుంచి అమెరికాను చేరుకునేందుకు 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉందని, అదే రాజధాని వాషింగ్టన్ డీసీని చేరుకోవాలంటే దానికి పట్టే సమయం 39 నిమిషాలని, ఉత్తరకొరియా ప్రయోగించిన క్షిపణిని గుర్తించి, అధ్యక్షుడికి తెలిపేందుకు చాలా సమయం పడుతుందని, దీంతో వెంటనే ఎలా స్పందించాలి? అన్నదానిపై నిర్ణయం తీసుకునేందుకు అధ్యక్షుడు ట్రంప్‌కు కేవలం 10 నిమిషాలు సమయం మాత్రమే మిగిలి ఉంటుందని అన్నారు. ఈ పది నిమిషాల సమయంలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకోవాలని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఉత్తరకొరియా వద్ద అమెరికా భూభాగాన్ని చేరుకునే సామర్ధ్యం ఉన్న క్షిపణులు లేవని, కానీ తయారు చేసే అవకాశాలు ఉన్నాయని మాత్రం వారు తెలిపారు.

More Telugu News