: పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల్లో అమెరికాపై పైచేయి సాధించిన భారత్!
పునరుత్పాదక ఇంధన పెట్టుబడుల్లో అమెరికాపై భారత్ పైచేయి సాధించినట్టు యూకేకు చెందిన ఈవై అనే గణాంక సంస్థ ప్రకటించింది. ఈ విషయంలో చైనా అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, తరువాతి స్ధానంలో భారత్ నిలిచిందని, గత ఏడాది అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఈ ఏడాది మూడో స్థానానికి దిగజారిందని వెల్లడించింది. 2015 తరువాత అమెరికా ర్యాంకు ఈ రంగంలో దిగజారడం ఇదే మొదటి సారని ఆ సంస్థ తెలిపింది. దీనికి కారణం ట్రంప్ పరిపాలన విధానమని తెలిపింది. గత ఏడాది రెన్యువబుల్ ఎనర్జీ కంట్రీ అట్రాక్టివ్ నెస్ ఇండెక్స్ (ఆర్ఈసీఏఐ) ర్యాంకుల్లో అమెరికా, చైనా తరువాత మూడోస్థానంలో నిలిచిన భారత్, 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం ఉత్పత్తి సాధించాలన్న లక్ష్యం నిర్దేశించుకుందని ఆ సంస్థ వెల్లడించింది.
అలాగే 2040 నాటికి మొత్తం ఉత్పత్తి సామర్థ్యంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని 40 శాతానికి చేర్చాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో పాటు అందుకు తగ్గ ప్రణాళికలతో ముందుకు వెళ్లడంతో భారత్ అమెరికాను వెనక్కి నెట్టగలిగిందని ఈవై సంస్థ అభిప్రాయపడింది. గత మూడేళ్లలో భారత్ 10 గిగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిందని, 2014 నాటికి సౌరవిద్యుదుత్పత్తి కేవలం 2.6 గిగావాట్లు మాత్రమేనని ఆ సంస్థ గుర్తుచేసింది. 2016-17 లో 5.4 గిగావాట్ల పవన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించిన భారత్... రికార్డు స్ధాయిలో మరింత మెరుగైన పునరుత్పాదక ఇంధన వనరులను పెంచుకునే ప్రయత్నంలో ఉందని తెలిపింది. దీనికి కారణం కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండడంతోపాటు ఆకర్షణీయ ఆర్థిక విధానాల వల్లే భారత్ ఈ స్థానానికి చేరుకుందని ఈవై సంస్థ అభినందించింది.