: ఆదరణలేని బంగారు పథకాలు.. వీటి గురించి తెలిసింది వెయ్యిమందిలో ఐదుగురికే!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ బంగారు పథకాలు ప్రజలను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైనట్టు ఓ సర్వే వెల్లడించింది. ఇవి అనుకున్నంతగా విజయవంతం కాకపోవడానికి ప్రజల్లో వీటిపై అవగాహన లేకపోవడమే కారణమని పేర్కొంది. నాలుగు రాష్ట్రాల్లోని వెయ్యిమందిపై జరిపిన సర్వేలో కేవలం ఐదుగురికి మాత్రమే వీటి గురించి కాస్తోకూస్తో తెలిసి ఉండడం గమనార్హం. రెండేళ్ల క్రితం ప్రభుత్వం గోల్డ్ మోనెటైజేషన్ స్కీం, సావెరియన్ గోల్డ్ బాండ్ స్కీం, గోల్డ్‌కాయిన్ స్కీంలను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ఊహించినంతగా ఈ పథకాలు విజయవంతం కాలేదు.
దానికి కారణం ప్రజల్లో అవగాహన లేకపోవడమేనని, ఈ పథకాలను ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైందని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అహ్మదాబాద్‌కు చెందిన ఇండియా గోల్డ్ పాలసీ సెంటర్ (ఐజీపీసీ) సర్వేలో వెల్లడైంది. సర్వేలో భాగంగా మహారాష్ట్రలోని కోలాపూర్, తమిళనాడులోని కోయంబత్తూరు, పశ్చిమబెంగాల్‌లోని హుగ్లీ, ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లలో 1000 మందిని ప్రశ్నించినట్టు ఐజీపీసీ హెడ్ ప్రొఫసర్ అర్వింద్ సహాయ్ తెలిపారు.
నాలుగు రాష్ట్రాల్లోని వెయ్యిమందిలో కేవలం ఐదుగురికి మాత్రమే ఈ పథకాలపై కొంత అవగాహన ఉన్నట్టు తేలిందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ (ఐఎఫ్ఎంఆర్) రీసెర్చర్ మిషా శర్మ తెలిపారు. ఈ పథకాలు ప్రజల్లోకి వెళ్లి విజయవంతం కావాలంటే ప్రభుత్వం వీటిపై విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉందని అర్వింద్ సహాయ్ అభిప్రాయపడ్డారు.