: అమెరికాలో అగ్నిప్రమాదం..సహజీవనం చేస్తున్న జంట, పిల్లలూ సజీవ దహనం!
అమెరికాలోని అక్రాన్ లో జరిగిన అగ్నిప్రమాదంలో విషాదం చోటు చేసుకుంది. ఓ జంటతో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులు సజీవ దహనమయ్యారు. అక్రాన్ కు చెందిన డెన్నిస్ హగిన్స్ తన గర్ల్ ఫ్రెండ్ ఏంజెలా బోగ్స్ తో కలిసి సహజీవనం చేస్తున్నాడు. డెన్నిస్ కు ఐదుగురు పిల్లలు ఉండగా, ఏంజెలాకు ఒక బిడ్డ. ఈ రోజు తెల్లవారుజామున హగిన్స్ ఇంట్లోని ఓ గది నుంచి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఈ మంటలు భవనమంతటా వ్యాపించాయి. డెన్నిస్, ఏంజెలా తో పాటు ఐదుగురు పిల్లలు, ఓ పెంపుడు శునకం అగ్నికి ఆహుతైపోయారు.
అయితే, డెన్నిస్ పెద్ద కుమారుడు టైన్నిస్ హగిన్స్ అక్రాన్ లోనే వేరే ఇంట్లో నివసిస్తున్నాడు. తన కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు ఫోన్ చేశాడు. ఎవరూ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఈ ఫోన్ చేసిన కొంచెం సేపటికే, టైన్నిస్ కు తన బంధువుల నుంచి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా ప్రమాద సంఘటన విషయం తెలుసుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.