: జియో ఎంట్రీతో భారీ నష్టాలను చవిచూస్తున్న ‘ఐడియా’!
టెలికాం మార్కెట్లో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. జియో కురిపిస్తోన్న ఆఫర్ల దెబ్బకు మిగతా కంపెనీలు నష్టాలు చవిచూస్తున్నాయి. జియో ప్రభావం ఐడియా సెల్యులార్ పై కూడా బాగానే పడింది. గతేడాది మార్చి 31తో ముగిసిన త్రైమాసికానికి రూ.449.2 కోట్ల లాభంలో ఉన్న ఐడియా.. ఈ సారి అదే సమయానికి రూ.325.6 కోట్ల నికర నష్టాన్ని చవి చూడడం గమనార్హం. ఐడియా వరుసగా చివరి రెండు త్రైమాసికాల్లో నష్టాలను నమోదు చేసింది.
గతేడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో జియోదెబ్బకు ఏకీకృత ప్రాతిపదికన రూ.383.87 కోట్ల నష్టాన్ని చవిచూసింది ఐడియా. అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో మాత్రం ఐడియా ఏకంగా రూ.659.35 కోట్ల లాభంతో ఉండటం విశేషం. గతేడాది అక్టోబర్-నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు టెలికాంకు విరామ కాలంగా అభివర్ణించవచ్చని ఈ సందర్భంగా ఐడియా సెల్యులార్ పేర్కొంది. జియో రాకముందు భారీ లాభాలతో ఉన్న ఐడియా ఇప్పుడు ఇలా భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది.