: అంబులెన్సుకి డబ్బులడిగారు... బల్లరిక్షాపై తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లాడు!
అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో మృతి చెందిన తన తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ కావాలని అడిగిన ఓ యువకుడికి.. కేవలం రోగులను తీసుకొచ్చేందుకే అంబులెన్స్ సదుపాయం ఉంటుందనే సమాధానం వచ్చింది. దీంతో ప్రైవేటు అంబులెన్స్ కోసం అతడు సంప్రదించాడు. అయితే, దానిని ఉపయోగించుకోవాలనుకుంటే రూ.400 కట్టాలని సిబ్బంది అన్నారు. కానీ, నిరుపేద అయిన ఆ యువకుడి వద్ద రూ.150 మాత్రమే ఉన్నాయి. దీంతో రూ.400 చెల్లించలేని స్థితిలో చివరకు ఓ బల్లరిక్షాపై తన తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లాడు.
ఈ ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో చోటు చేసుకుంది. బల్లరిక్షాపై సరబ్‌జీత్ అనే వ్యక్తి తన తండ్రి మృతదేహాన్ని తీసుకెళుతున్న దృశ్యం అక్కడి వారిని కలచి వేసింది. ఈ ఘటనపై సరబ్‌జీత్ మాట్లాడుతూ... తన బంధువు సాయంతో ఓ బల్ల రిక్షాపై తన తండ్రి మృతదేహాన్ని తీసుకుని ఇంటికి బయలుదేరానని, కొంత సమయం తర్వాత తన వద్ద ఉన్న రూ.150తో ఆటోలో ఆ మృతదేహాన్ని తీసుకెళ్లానని చెప్పాడు.