: రుద్రమదేవి, శాతకర్ణి, బాహుబలి వంటి సినిమాలకు మాత్రం కేసీఆర్ గిట్టుబాటు ధర ఇస్తున్నారు: రేవంత్ రెడ్డి ఎద్దేవా
తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల ప్రదర్శిస్తోన్న తీరు బాగోలేదని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఖమ్మంలో నిర్వహించిన రైతు దీక్షలో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిసారి ఒక మాట చెబుతున్నారు.. తెలంగాణను ఆంధ్రపాలకులు వెనకబడేలా చేశారు అంటున్నారు.. మరి కేసీఆర్ చేస్తోందేంటో చెప్పాలి.. కోటి ఎకరాలకు నీరు ఇస్తానని కేసీఆర్ చెబుతున్నారు.. సంతోషం... కోటి ఎకరాలకు నీరు ఇవ్వండి. అయితే, మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. కేవలం రెండున్నర లక్షల ఎకరాల్లో పండిన పంటకే గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. కోటి ఎకరాలు పండిస్తే ఇక ఆ గోస ఎంతగా ఉంటుంది.. రెండున్నర లక్షల ఎకరాల్లో పండిన పంటనే గిట్టుబాటుధరకు కొనేలా చేయడం లేదు.. ఇక కోటి ఎకరాల పంటలు పండిస్తే మీరు గిట్టుబాటు ధర ఇచ్చి కొంటారా? పసుపు, కందులు, మిర్చి, వరి ఇలా ఏ పంట చూసుకున్నా గిట్టుబాటు ధర లేదు’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వని కేసీఆర్ మరోవైపు సినిమా వాళ్లకి మాత్రం గిట్టుబాటు ధర ఇస్తున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రుద్రమదేవి సినిమాకి, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి అనుకూలంగా వ్యవహరించి పన్ను మినహాయింపు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం ఆదుకుందని, బాహుబలి సినిమా కోసం మీ ఇష్టమైన ధరకు టిక్కెట్లు అమ్ముకోండని రాష్ట్ర సర్కారు తెలిపిందని అన్నారు. సినిమా తీసేవారికి కూడా గిట్టుబాటు ధర ఇస్తున్నారని, రైతులకు మాత్రం ఇవ్వడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. రైతులకు ఎందుకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదో కేసీఆర్ చెప్పాలని ఆయన అన్నారు.
మరోవైపు తెలంగాణలో పాత్రికేయ మిత్రులు రైతుల సమస్యలపై ఎందుకు రాతలు రాయడం లేదని ఆయన ప్రశ్నించారు. రైతుల సమస్యలను పాత్రికేయులు పట్టించుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. తుమ్మల నాగేశ్వరరావు నిజంగా ఖమ్మం జిల్లా బిడ్డే అయితే, కలెక్టరేట్ సాక్షిగా రైతుల కాళ్లు కడిగి ఆ నీరు తలపై చల్లుకుంటే రైతులకు చేసిన పాపాలు పోతాయని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తలమాసినోళ్లు తమను హెచ్చరిస్తే రైతుల పట్ల మాట్లాడకుండా పారిపోవడానికి తాము సిద్ధంగా లేమని, తాము అన్న ఎన్టీఆర్ వారసులమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.