: ఇస్లామిక్ సంప్రదాయాన్ని సవాల్ చేసిన ప్రథమ మహిళ ఈమే.. తలాక్‌పై నేడు దేశ వ్యాప్తంగా పోరు!
ముస్లిం మహిళలను కష్టాల్లోకి నెట్టేస్తోన్న తలాక్ విధానం రద్దు అంశంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పద్ధతి ద్వారా వస్తోన్న సమస్యలపై ఇన్నాళ్లూ నోరు విప్పని ముస్లిం మహిళలు ఇప్పుడు కేసులు వేస్తూ కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నారు. సదరు మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి కారణం.. షాయరా బానో అనే ఓ ముస్లిం మహిళే అని చెప్పుకోవచ్చు. తలాక్, బహుభార్యత్వం వంటి దురాచారాలను సవాల్ చేస్తూ ఆమే మొదటిసారిగా కోర్టును ఆశ్రయించడంతో, ఆ తరువాత ఎంతో మంది మహిళలు కూడా ముందుకు వచ్చి తమ సమస్యలపై గళం విప్పారు. షాయరా బానో ఇచ్చిన స్ఫూర్తితో ఇప్పుడు దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు సంతకాల ఉద్యమంలో పాల్గొంటున్నారు. అంతేకాదు, వారంతా ఏకమై ఇతర రూపాల్లోనూ సర్కారుపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.
షాయరా బానో తనకు ఎదురైన సమస్య గురించి కోర్టుకు ఎక్కడంతో తలాక్ రద్దుపై ఈ ఉద్యమం ఆరంభమైందని చెప్పుకోవచ్చు. ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌లో పుట్టింటిలో ఉన్న బానోకు అలహాబాద్‌లో ఉన్న ఆమె భర్త నుంచి పోస్టులో 'తలాక్' అందింది. అందరి మహిళలలాగే మొదట తీవ్రంగా బాధపడిన ఆమె తరువాత కోర్టును ఆశ్రయించింది. అత్తింటి వారు, భర్త నుంచి తాను వేధింపులు ఎదుర్కున్నానని కూడా షాయరా బానో కోర్టుకు తెలిపింది.
ఆమె సామాజిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసింది. చట్టం ప్రకారం తనకు సమానత్వం కావాలని ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఓ ముస్లిం మహిళ ఇస్లామిక్ సంప్రదాయాన్ని సవాల్ చేయడం ఇదే ప్రథమం. ఆ తరువాత ముస్లిం మహిళలు ఇదే అంశంపై కోర్టులను ఆశ్రయించడంతో సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఈ అంశంపై విచారణ కొనసాగుతోంది.