: ఢిల్లీ మెట్రో చేసిన తప్పుకు ఫ్రీగా రూ. 4,725 కోట్లు కొట్టేసిన రిలయన్స్ ఇన్ ఫ్రా!


దేశ రాజధానిలో ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ లైన్ మెట్రో విస్తరణ కాంట్రాక్టు పనులను రిలయన్స్ ఇన్ ఫ్రాకు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని, ఆపై దాన్ని పాటించనందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఢిల్లీ మెట్రో నుంచి రిలయన్స్ ఇన్ ఫ్రా అనుబంధ సంస్థ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మెట్రో ఎక్స్ ప్రెస్ (టీఏఎంఈపీఎల్)కు ఆర్బిట్రేషన్ అవార్డుగా రూ. 2,950 కోట్లను వడ్డీ సహా చెల్లించేందుకు ఒప్పుకుంది. ఈ మొత్తానికి వడ్డీని కలిపితే రూ. 1,775 కోట్లు కానుండటంతో మొత్తం 4,725 కోట్లు రిలయన్స్ ఇన్ ఫ్రాకు అందనున్నాయి. దేశం మొత్తంలో ఓ డీల్ కుదుర్చుకుని దాన్ని రద్దు చేసుకున్నందుకు ఆఫర్ చేసిన అతిపెద్ద మొత్తం ఇదే కావడం గమనార్హం.

తమతో చేసుకున్న ఒప్పందాన్ని డీఎంఆర్సీ రద్దు చేసుకున్న తరువాత, సంస్థకు చెడ్డ పేరు వచ్చిందని, దీనివల్ల తమకు నష్టం కలిగిందని సంస్థ ట్రైబ్యునల్ ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఈ మొత్తం ఇచ్చేందుకు డీఎంఆర్సీ అంగీకరించక తప్పలేదు. ఇక తమకు రానున్న మొత్తంపై స్పందిస్తూ, "ఢిల్లీలో మెట్రో విస్తరణకు పీపీపీ (పబ్లిక్ - ప్రైవేట్ పార్టనర్ షిప్) కింద ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. దురదృష్టవశాత్తూ అగ్రిమెంట్ రద్దయింది. ఈ నష్టపరిహారాన్ని స్వాగతిస్తున్నాం. భవిష్యత్తులోనూ పీపీపీ మోడల్ ప్రాజెక్టులకు సహకరించి దేశాభివృద్ధికి పాటుపడతాం" అని ఓ ప్రకటనలో తెలిపింది.

దీనిపై డీఎంఆర్సీ ప్రతినిధి స్పందిస్తూ, నష్టపరిహార మొత్తాన్ని అధ్యయనం చేస్తున్నామని, తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటే తమకు మేలు కలుగుతుందని ఆలోచిస్తున్నామని తెలిపారు. కాగా, టర్మినేషన్ నిబంధనలు, ఒప్పందంలో కుదుర్చుకున్న నియమాలను అనుసరించి ముగ్గురు సభ్యుల ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్ ఈ తీర్పు ఇచ్చింది. ట్రైబ్యునల్ లో డీఎంఆర్సీ నామినేట్ చేసిన ప్యానలే మూడున్నరేళ్ల పాటు విచారణ జరిపి ఈ తీర్పు ఇవ్వడం గమనార్హం.

  • Loading...

More Telugu News