: భారీ బడ్జెట్ తో 'శివాజీ' సినిమా.. అతిథి పాత్రలో సల్మాన్ ఖాన్
'బాహుబలి' సినిమా మన దేశ సినీ రంగ భవిష్యత్తునే మార్చివేసింది. ఈ సినిమా స్ఫూర్తితో ఇప్పుడు చాలా మంది దర్శక నిర్మాతలు భారీ చిత్రాల నిర్మాణానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా 'బాహుబలి'ని మించిన సినిమా తీయాలనే కసితో బాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో రితీష్ దేశ్ ముఖ్ మరాఠా యోధుడు శివాజీ కథతో భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. రూ. 225 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.
ఈ సినిమాలో శివాజీ పాత్రను రితీష్ పోషించనున్నాడు. మరో కీలక పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నాడు. ఆసక్తికర విషయం ఏమిటంటే, సల్మాన్ ఖాన్ కూడా ఈ సినిమాలో ఓ అతిథి పాత్రలో కనిపించనున్నాడట. వాస్తవానికి ఈ సినిమాను గతంలోనే నిర్మించాల్సి ఉంది. అయితే, ఇంత భారీ బడ్జెట్ వర్కవుట్ అవుతుందో లేదో అనే సందేహంతో ఆగిపోయారు. బాహుబలి ఘన విజయం సాధించడంతో... ఇప్పుడు దర్శక నిర్మాతలకు ధైర్యం వచ్చింది.