: 'మాట్లాడుకుందాం రండి!' అంటూ అభిమానులకు కబురంపిన రజనీకాంత్... రాజకీయ ప్రవేశం ముహూర్తానికి వేళాయే!


తమిళనాడులో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన జాతీయస్థాయి నేతలు రజనీకాంత్ కేంద్రంగా పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్...తన అభిమానులకు 'మాట్లాడుకుందాం రండి!' అంటూ కబురు పంపారు. దీంతో ఈనెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు చెన్నైలోని కోడంబాకంలోని రాఘవేంద్ర కళ్యాణ మండపాన్ని బుక్ చేశారు. అందులో ఆయన అభిమానులను కలుసుకోనున్నారు. దీంతో ‘సమయం ఆసన్నమైంది తలైవా. రాజకీయాలా? సినిమాలా? సరైన నిర్ణయం తీసుకునే తరుణం ఇదే. తమిళప్రజలకు మంచి జరగాలంటే మీరు పాలించాలి. ఇది అభిమానులుగా మా ఆకాంక్ష, అభిమతం’ అంటూ తమిళనాట పోస్టర్లు వెలిశాయి. 

గత నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఆయన అభిమానులను కలవాల్సి ఉండగా...ఒక్కో అభిమాని రజనీకాంత్‌ తో ఫొటో దిగాలన్న ఆకాంక్ష తీర్చేందుకు వీలుగా కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అభిమానులను కలవనున్నారు. ప్రతి రోజూ మూడు జిల్లాలకు చెందిన అభిమానులను కలవనున్నారు. అలా ఐదు రోజులపాటు 15 జిల్లాలకు చెందిన తన అభిమానులను ఆయన కలుసుకోనున్నారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటించిన అనంతరం ఫోటోలు దిగి, విందు ఇవ్వనున్నారు. ఈ మేరకు రజనీకాంత్‌ అభిమాన సంఘం అధ్యక్షుడు కేఎస్ రాజా ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సమావేశాల అనంతరం ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఆయన రాజకీయాల్లోకి వస్తే తామే చూసుకుంటామని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News