: ఇలాగే మరో రెండేళ్లు గడిపేస్తే... ప్రజలు మమ్మల్ని చెప్పుతో కొడతారు!: రైల్వే అధికారులపై రాయపాటి సీరియస్
రైల్వే బోర్డు అఫీషియల్స్ ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర నేతల కంటే పవర్ ఫుల్ గా మారారని టీడీపీ సీనియర్ నేత, ఎంపీ రాయపాటి సాంబశివరావు రైల్వే అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జీఎంతో సమావేశం సందర్భంగా ఎంపీ రాయపాటి రైల్వే అధికారులను నిలదీశారు. గత 10 ఏళ్లుగా ఎంపీలు, కేంద్ర మంత్రులు విశాఖకు రైల్వే జోన్ కావాలని పోరాడుతున్నా ఎందుకు రావడం లేదని ఆయన ప్రశ్నించారు. కేవలం రైల్వే అధికారుల తీరువల్లే ఏపీకి రైల్వే జోన్ రావడం లేదని అన్నారు. రైల్వే జోన్ మంజూరుకు అవసరమైన ప్రాథమిక చర్యలు చేపట్టలేదని, ఒడిశాలోని ఈస్ట్ కోస్ట్ రైల్వేకు అనుకూలంగా అధికారులు పని చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రధాని వరకు వెళ్లి తాము సమస్యలు పరిష్కరిస్తుంటే... అధికారులు ఏమాత్రం సహకరించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు-తెనాలి డబ్లింగ్ పనులు పదేళ్లుగా కొనసాగుతున్నా, ఇప్పటికీ పూర్తికాలేదని రైల్వే అధికారుల తీరును తూర్పారబట్టారు. దీంతో ఆ పనుల గురించి తాము మర్చిపోయామని, వైజాగ్ రైల్వే జోన్ ను కూడా అలాగే మర్చిపోతామని రైల్వే అధికారులు భావిస్తున్నారని ఆయన అన్నారు. అయితే ఇలాగే మరో రెండేళ్లు గడిపేస్తే...ప్రజలు తమను చెప్పుతో కొడతారని ఆయన వ్యాఖ్యానించారు. తాము ఏదన్నా మాట్లాడితే ముఖ్యమంత్రికి ఇష్టం ఉండదని ఆయన చెప్పారు. అయినా రైల్వే అధికారుల కారణంగా మాట్లాడాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముందు రాష్ట్రానికి రైల్వే జోన్ వస్తే...తరువాత దానిని వైజాగ్ కి మార్చుకోవచ్చని ఆయన తెలిపారు. ముందు రాష్ట్రానికి విభజన చట్టంలో ఉన్న విధంగా రైల్వే జోన్ ప్రాధమిక పనులు పూర్తి చేయాలని ఆయన సూచించారు. లేని పక్షంలో ఇలాంటి ఎన్ని సమావేశాలు పెట్టినా ఫలితం ఉండదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ సమావేశానికి ఎంపీ కేశినేని నాని, కొనకళ్ల నారాయణ గైర్హాజర్ కావడం విశేషం.