: వెంకన్నకు వండి వడ్డించే రహస్య నైవేద్యాల గురించి ఆసక్తికర విషయాలు... రాష్ట్రపతికి తొలి ప్రతి ఇచ్చిన రమణ దీక్షితులు

తిరుమల శ్రీవెంకటేశ్వరుని పేరు వినగానే గుర్తొచ్చేది లడ్డూ ప్రసాదమే. ఇక ఆలయానికి తరచూ వెళ్లి వచ్చే వారికి చక్కెర పొంగలి, పెరుగన్నం, పులిహోర వంటి ప్రసాదాలు కూడా సుపరిచితమే. అసలు స్వామివారికి ఏ సమయంలో ఏఏ రకాల ఆహార పదార్థాలను నైవేద్యంగా వడ్డిస్తారు? ఈ విషయమై పూర్తిగా సమాచారం తెలిసిన వ్యక్తులు అతి కొద్దిమందే. వారిలో ఒకరు ఆలయ ప్రధానార్చకులు రమణ దీక్షితులు. ఆయన ‘ది సేక్రెడ్‌ ఫుడ్‌ ఆఫ్‌ గాడ్‌’ (స్వామివారి పవిత్ర ప్రసాదాలు) అనే పేరిట స్వామివారి నైవేద్యాలపై ఆసక్తికర పుస్తకం రాసి, తొలి ప్రతిని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి అందించారు. ఈ పుస్తకంలో దివ్య ప్రసాదాలపై ఎన్నో విషయాలను పంచుకున్నారు.

స్వామికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి? ఏఏ పదార్థాలు ఏ కొలతలతో ఉండాలి? ఎలా వండాలి? తదితర విషయాలన్నీ ఆగమ శాస్త్రంలో స్పష్టంగా ఉన్నాయని, వాటిని తాము తు.చ తప్పక పాటిస్తామని తెలిపారు. ప్రసాదాలను తయారు చేసే వంట చెరకుగా మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాలకు చెందిన ఎండు కొమ్మలను వాడుతామని, పాలుకారే చెట్లు, ముళ్లున్న చెట్లను వాడబోమని ఆయన పేర్కొన్నారు. వంట చేసే సమయంలో వాసన కూడా చూడబోమని, స్వామివారు ఆరగించేంత వరకూ బయటి వారెవరూ వాటిని చూడరని తెలిపారు.

గర్భాలయ శుద్ధి తరువాత, నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే స్వామి సన్నిధిలో ఉండి, విష్ణు గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ, స్వామికి గోరు ముద్దలు తినిపిస్తున్నట్టుగా, కుడి చేతితో ప్రసాదాలను తాకి, ఆపై స్వామివారి కుడిచేతికి దాన్ని తాకించి, నోటి దగ్గర ఉంచుతారని, ముద్ద ముద్దకూ మధ్య ఔషధ గుణాలున్న ఆకులు కలిపిన నీటిని స్వామికి అందిస్తారని తెలిపారు. స్వామి విగ్రహం ఎత్తు 9.5 అడుగులు కాగా, దానికి అనుగుణంగా ఏ సమయంలో ఎంత ప్రసాదం అందించాలో ఆగమ శాస్త్రాల్లో ఉందని రమణ దీక్షితులు తన పుస్తకంలో వెల్లడించారు.

ఉదయం సుప్రభాతంతో స్వామిని నిద్రలేపిన తరువాత, అప్పుడే తీసిన చిక్కని వెన్న నురుగు తేలే ఆవు పాలను సమర్పిస్తామని, తోమాల, సహస్రనామార్చన సేవల తరువాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం నైవేద్యంగా పెట్టి, ఆపై బాలభోగం అందిస్తామని తెలిపారు. బాలాభోగంలో భాగంగా, మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ్వ కేసరి మెనూలో ఉంటాయని తెలిపారు. ఆపై సర్వదర్శనం మొదలవుతుందని, అష్టోత్తర శతనామ అర్చన తరువాత రాజభోగం సమర్పణ ఉంటుందని తెలిపారు.

రాజభోగంలో భాగంగా, శుద్ధాన్నం, పులిహోర, గూడాన్నం, దద్యోజనం, శీర లేక చక్కెరన్నం నైవేద్యంగా అందిస్తామని ఆయన పేర్కొన్నారు. సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయాన్ని శుద్ధి చేసి, స్వామిని తాజా పూలతో అలంకరిస్తారు. ఆపై అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తామని అన్నారు. శయనభోగంలో భాగంగా మరీచ్య అన్నం (మిరియాల అన్నం) దోసె, లడ్డు, వడ, శాకాన్నం మెనూలో ఉంటాయని, అర్ధరాత్రి తిరువీశం పేరిట బెల్లపు అన్నం (శుద్ధాన్నం, గూడాన్నం), పవళించే వేళ ఏకాంత సేవలో నేతిలో వేయించిన బాదం, జీడిపప్పులు, కోసిన పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి నైవేద్యంగా అందిస్తామని అన్నారు.

కాగా, ప్రస్తుతం ఇంగ్లీషు భాషలో ముద్రితమైన పుస్తకాన్ని త్వరలో భారతీయ భాషల్లోకి అనువదించి అందిస్తానని, దీనిపై వచ్చే రాయల్టీని అన్న ప్రసాద కేంద్రానికి వితరణగా అందించాలని నిర్ణయించానని ఈ సందర్భంగా రమణ దీక్షితులు పేర్కొన్నారు.

More Telugu News