: కలకలం.. శేఖర్ రెడ్డి డైరీలో 12 మంది మంత్రుల పేర్లు!
ఇసుక కాంట్రాక్టర్, టీటీడీ మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి డైరీలో 12 మంది తమిళనాడు మంత్రుల పేర్లు ఉండటం కలకలం రేపుతోంది. వీరితో పాటు 14 మంది ఐఏఎస్, 12 మంది ఐపీఎస్ అధికారుల పేర్లు కూడా డైరీలో ఉన్నాయి. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంలోని అవినీతి తిమింగలాలపై ఆదాయపు పన్ను శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో, అవినీతి ఉన్నతాధికారుల చిట్టాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ కు అందజేసింది. దాడులకు అనుమతి కోసం ఐటీ అధికారులు వేచి ఉన్నారు.
శేఖర్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన సమయంలో, రూ. 300 కోట్ల విలువైన అక్రమాల వివరాలతో కూడిన డైరీని ఐటీ అధికారులు గుర్తించారు. ఇందులో శేఖర్ రెడ్డితో అక్రమ లావాదేవీలు జరిపిన రాష్ట్రమంత్రులు, ఉన్నతాధికారుల వివరాలు, వారికి ఇచ్చిన లంచాల వివరాలు కూడా ఉన్నాయి. ఈ వివరాల ఆధారంగా ఉన్నతాధికారులను విచారించేందుకు ఢిల్లీ ఐటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఐటీ దాడులు ప్రారంభమవుతాయి.