: జస్టిస్ కర్ణన్ సంచలన నిర్ణయం.. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సహా ఇతర జడ్జీలకు ఐదేళ్ల శిక్ష విధించిన వైనం!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జేఎస్ ఖేర్కర్ తో పాటు, మరో ఆరుగురు సుప్రీంకోర్టు జడ్జిలకు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నానని కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ సంచలన ప్రకటన చేశారు. ఓ దళిత జడ్జికి వ్యతిరేకంగా ప్రవర్తించినందుకు గాను, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద వారికి ఈ శిక్ష విధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
సుప్రీం కోర్టు జడ్జిలపై అవినీతి ఆరోపణలు చేసిన జస్టిస్ కర్ణన్ పై ఈ ఏడాది మార్చి 17న కోర్టు ధిక్కార నేరం కింద బెయిలబుల్ వారెంట్ ను జారీ చేశారు. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని, న్యాయసంబంధమైన విధులు నిర్వహించేందుకు కుదరదని సుప్రీంకోర్టు బెంచ్ నాడు ఆదేశించింది. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలన్న కర్ణన్ డిమాండ్ ను సుప్రీంకోర్టు పట్టించుకోలేదు. కోల్ కతాలోని ప్రభుత్వ ఆసుపత్రి నియమించిన వైద్యుల బృందం సమక్షంలో కర్ణన్ కు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఈ నెల 1వ తేదీన అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
అయితే, మానసిక వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆయన తిరస్కరించారు. తన మానసిక పరిస్థితి చాలా చక్కగా ఉందని ఆ వైద్యుల బృందానికి కర్ణన్ చెప్పడం జరిగింది. ఈ ఆదేశాలు జారీ చేసిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జేఎస్ ఖేర్ కర్ కు, ధర్మాసనంలోని జడ్జిలకే మతిస్థిమితం నిమిత్తం వైద్య పరీక్షలు నిర్వహించాలని కర్ణన్ ఆదేశించారు.