: ప్రపంచంలోనే తొలిస్థానం.. భారత్‌లో అమ్ముడవుతున్న టూ వీలర్లు ఎన్నో తెలుసా?
భారతీయులు ద్విచక్ర వాహనాలని కొనడానికి అమితమైన ఆసక్తి కనబరుస్తున్నారు. టూ వీలర్లు అత్యధికంగా అమ్ముడవుతున్న దేశాల్లో 2015 వరకు చైనా అగ్రస్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆ విషయంలో చైనాను భారత్ వెనక్కి నెట్టేసింది. 2016లో భారత్‌లో 17.7 మిలియన్ల ద్విచక్రవాహనాలు అమ్ముడుపోయాయి. దీంతో భారత్ తొలిస్థానంలో నిలిచిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్‌ఫ్యాక్చరర్ నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు గతేడాది చైనాలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16.8 మిలియన్లుగా నమోదయ్యాయి.
మన దేశంలో మొత్తం అమ్మకాల్లో స్కూటర్ల వాటా 5 మిలియన్లకు పైగా ఉందని ఆ నివేదిక ద్వారా తెలుస్తోంది. 100-110 సీసీ వాహనాలు సుమారు 6.5 మిలియన్లుగా ఉన్నాయి. మనదేశంతో పోల్చుకుంటే చైనా ద్విచక్రవాహనాల మార్కెట్ పెద్దది. చైనాలో కొత్తగా ద్విచక్రవాహనాల అమ్మకాలపై పలు ఆంక్షలు పెట్టారు. మరోవైపు కార్లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. దీంతో టూవీలర్ అమ్మకాలు పడిపోయాయి. ఆ దేశంలో 2010లో టూ వీలర్ విక్రయాలు ఏకంగా 27 మిలియన్లుగా నమోదయ్యాయి. ఆ తరువాతి సంవత్సరం నుంచి క్రమంగా టూ వీలర్ మార్కెట్ తగ్గుతూ వచ్చింది. మరోవైపు మన దేశంలో ఆ అమ్మకాలు పెరుగుతూ వచ్చాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 17 మిలియన్లు దాటిపోయింది.