: పెళ్లి పందిట్లో సినిమా సీన్: వరుడు తాళి కడుతున్న సమయంలో 'ఆపండి...' అంటూ పోలీసులతో వచ్చి పెళ్లి కొడుకును అరెస్టు చేయించిన యువతి!

బంధుమిత్రులు, మేళతాళాలు, పురోహితుడి వేద మంత్రాలతో కళకళలాడుతున్న పెళ్లి పందిట్లో తాళికట్టేందుకు వరుడు సిద్ధమవుతున్న సమయంలో... 'ఆపండి...' అంటూ బిగ్గరగా ఒక గొంతు.. ఆ వెంటనే బిలబిల్లాడుతూ పోలీసులు కల్యాణ మంటపాన్ని చుట్టుమట్టారు... ఈ సన్నివేశం ఎన్నో తెలుగు సినిమాల్లో చూసే ఉంటారు. అయితే ముంబైలో ఇలాంటి ఘటన నిజ జీవితంలో చోటుచేసుకుంది.

ముంబైలోని బైసర్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువకుడు తన బంధువైన 24 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకుంటానని చెబుతూ గత ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఈ మధ్య అతని తీరులో తేడా వచ్చింది. గుట్టుగా మరో యువతిని వివాహం చేసుకునేందుకు గుట్టుచప్పుడు కాకుండా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ విషయం ఆమెకు ఎలాగోలా తెలియడంతో చివరి క్షణంలో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

చిన్ననాటి నుంచే పరిచయం ఉన్న తామిద్దరం ప్రేమించుకున్నామని, అందుకే సహజీవనం చేశామని తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానన్నాడు కనుకే తాను సహజీవనం చేశానని ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, సరిగ్గా తాళి కట్టే సమయానికి కల్యాణ మంటపంలోకి ఎంట్రీ ఇచ్చి... 'ఆపండి' అంటూ పీటల మీద ఉన్న పెళ్లి కొడుక్కి సంకెళ్లు వేశారు. ఆరేళ్లుగా ఆ యువతిపై అతను అత్యాచారం చేశాడని చెబుతూ, మోసం, అత్యాచారం వంటి నేరాలపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించారు.

More Telugu News