: ఫేస్ పౌడర్ వాడకం వల్ల కేన్సర్... జాన్సన్ అండ్ జాన్సన్ కు 700 కోట్ల రూపాయలు జరిమానా


జాన్సన్ అండ్ జాన్సన్ (జే అండ్ జే) సంస్థకు ముస్సోరీలోని ఓ న్యాయస్థానం కంపెనీకి భారీ జరిమానా విధించింది. కంపెనీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం బాధితురాలికి 110 మిలియన్ డాలర్ల (700 కోట్ల రూపాయలు) నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే... వర్జీనియాకు చెందిన లూయిస్ స్లెంప్ అనే మహిళకు గర్భాశయ క్యాన్సర్ సోకినట్టు 2012లో తేలింది. క్రమంగా అది కాలేయం వరకు వ్యాపించడంతో ప్రస్తుతం కీమోథెరపీతో చికిత్స చేస్తున్నారు. వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం... నలబై ఏళ్లుగా జాన్సన్ అండ్ జాన్సన్, జాన్సన్ బేబీ పౌడర్, షోవర్ టు షోవర్ పౌడర్ ఉపయోగించడం వల్ల తనకు క్యాన్సర్ సోకిందని ఆమె న్యాయస్థానంలో కేసు నమోదు చేశారు.

దీనిపై న్యాయ విచారణ జరిపిన న్యాయస్థానం...జే అండ్ జే పౌడర్ సరఫరాదారు ఇమెరీస్ తప్పు 1 శాతం ఉంటే జే అండ్ జే తప్పు 99 శాతం ఉందని కోర్టు నిర్ధారించింది. ఇమెరీస్‌ కి 50 వేల డాలర్ల జరిమానా విధించింది. జాన్సన్ బేబీ పౌడర్ సహా ఇతర పౌడర్ ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ ప్రమాదం ఉన్నట్టు ఆ సంస్థ వినియోగదారులకు సరైన హెచ్చరికలు ఇవ్వలేదని న్యాయస్థానం మండిపడింది. ఇలాంటి ఆరోపణలపైనే ఆ కంపెనీపై 2,400 పెండింగ్ కేసులు ఉన్నాయని గుర్తు చేసింది. కాగా, గతంలో ఇలాంటి కేసుల్లోనే జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ 197 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించుకుంది. తాజాగా 700 కోట్ల రూపాయలు చెల్లించుకోనుంది. బాధిత మహిళలకు క్యాన్సర్ సోకడంపై సానుభూతి వ్యక్తం చేస్తూనే... ఈ తీర్పును సవాలు చేసేందుకు సిద్ధపడుతున్నట్టు జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తెలిపింది.

  • Loading...

More Telugu News