: నటన నుంచి విరామం తీసుకుంటున్నా... నా చివరి దర్శకుడు మీరే అని క్రిష్ కి చెప్పేశాను!: బాలీవుడ్ 'క్వీన్'
బాలీవుడ్ 'క్వీన్' కంగనా రనౌత్ నటన నుంచి విరామం తీసుకుంటున్నట్టు ప్రకటించింది. మంచి ఫాంలో ఉన్న కంగనా ఈ రకమైన ప్రకటన చేయడంతో బాలీవుడ్ లో కలకలం రేగుతోంది. గత కొంత కాలంగా బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ ఆమెపై వివిధ వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆమె ప్రకటన ఆసక్తి రేపుతోంది. కాగా, 'మణికర్ణిక' సినిమా ప్రారంభం సందర్భంగా వారణాసి వెళ్లిన ఆమె మాట్లాడుతూ, తాను నటించే సినిమాలు కొంత ఆత్మసంతృప్తినిస్తాయని చెప్పింది. తనకు సరిగ్గా 15 ఏళ్ల వయసున్నప్పుడు ఇంటి నుంచి బయటకు వచ్చేశానని తెలిపింది. తానేదో సాధించగలనని, సాధిస్తానని కనీసం ఊహించలేదని తెలిపింది.
ఇప్పుడు తన జీవిత చక్రం కేవలం సినిమా విజయం...అపజయం మధ్యే ఉండిపోకూడదని భావిస్తున్నానని తెలిపింది. ఇకపై కేవలం నటనపై మాత్రమే దృష్టిపెట్టి సమయం వృథా చేసుకోవడం ఇష్టం లేదని చెప్పింది. నటన అనే దశ నుంచి మరో దశలోకి అడుగుపెట్టాలనుకుంటున్నానని, అందుకు ప్రయత్నాలు ప్రారంభించానని తెలిపింది. తాను ఫిల్మ్ మేకర్ గా ఎదగాలని భావిస్తున్నట్టు తెలిపింది. అలా ఎదిగిన తరువాత మళ్లీ నటన గురించి ఆలోచిస్తానని చెప్పింది. తనతో సినిమా చేసే చివరి దర్శకుడు మీరే అని క్రిష్ కు కూడా చెప్పేశానని ఆమె తెలిపింది.