: పిల్ విచారణకు డబ్బుల హామీ ఏంటి?: మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించిన తీరును సుప్రీం ధర్మాసనం తప్పుబట్టింది. ఎర్రచందనాన్ని కిరణ్‌కుమార్ రెడ్డి తక్కువ ధరకు విక్రయించారని, దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ నేత పి.శంకర్‌రావు అప్పట్లో పిల్ దాఖలు చేశారు. అయితే ఈ కేసుపై పిటిషనర్‌కు ఉన్న శ్రద్ధ ఏపాటిదో తెలుసుకోవాలంటే పిటిషనర్ రూ.297 కోట్ల విలువైన డిమాండ్ డ్రాప్ట్ తీసి సమర్పించాలని అప్పట్లో హైకోర్టు ఆదేశించింది. దీంతో శంకర్‌రావు సుప్రీంను ఆశ్రయించారు. గురువారం ఈ కేసులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా డిమాండ్ డ్రాఫ్ట్ విషయాన్ని శంకర్‌రావు తరపు న్యాయవాది శిశిర్ పినాకి సుప్రీం దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ గతంలో మంత్రిగా పనిచేశారని, ఆయన కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం తరపున గుంటూరు ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ పిల్‌లో ప్రజాప్రయోజనం ఉందో, లేదో తేల్చాలని, అంతేకానీ నగదు డిపాజిట్ చేయమనడం సరికాదని అన్నారు. దీంతో స్పందించిన చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహర్, న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌లతో కూడిన ధర్మాసనం.. ప్రజాప్రయోజన వాజ్యాన్ని తేల్చేందుకు నగదు ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు. వ్యాజ్యంలో ప్రజాప్రయోజనం ఉందో, లేదో తేల్చాలని, లేకుంటే పిటషనర్‌కు జరిమానా విధించాలని చెబుతూ శంకర్‌రావు పిల్‌ను పునఃవిచారించాలని ఆదేశించింది.