: టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్యకు కారణాలను వెల్లడించిన పోలీసులు
భార్య పావనీరెడ్డితో స్వల్ప గొడవకు దిగి.. మద్యం మత్తులో క్షణికావేశానికి లోనై టీవీ నటుడు ప్రదీప్ కుమార్ (26) ఆత్మహత్య చేసుకున్నాడని హైదరాబాదు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, వివిధ రూపాల్లో విచారణ చేశారు. ఈ సందర్భంగా పలువురిని ప్రశ్నించారు. అనంతరం ఈ కేసు వివరాలు వెల్లడిస్తూ....శ్రవణ్ పుట్టిన రోజు వేడుక ముగిసిన తర్వాత స్నేహితులందరూ అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఫ్లాట్ నుంచి ఎవరిళ్లకు వారు వెళ్లిపోయారు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య స్పల్ప వివాదం చోటుచేసుకుంది. ‘‘నన్ను నువ్వు అంతగా పట్టించుకోవడం లేదు’’ అంటూ భార్య పావని వద్ద ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశాడు.
దీంతో ప్రదీప్ తో తాను ఎలా ఉంటున్నానో వివరించిన పావని...బాత్రూంలోకి వెళ్లి గడియపెట్టుకుని ఏడ్చింది. దీనిని గుర్తించిన ప్రదీప్ రెండుసార్లు తలుపు తీయమంటూ తట్టాడు. తిట్టాడన్న బాధతో ఆమె తలుపు తీయలేదు. దీంతో పార్టీలో పూటుగా మద్యం తాగిన ప్రదీప్ పక్కనే ఉన్న అద్దాన్ని బలంగా కొట్టాడు. దీంతో అది పగిలిపోయింది. గాజులు అతని చేతికి గుచ్చుకున్నాయి. ఈ శబ్దానికి బయటకు వచ్చిన పావని...అతని చేతికి వస్తున్న రక్తాన్ని తుడిచి, చేతికి కట్టుకట్టింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం సద్దుమణిగింది. ఉదయం షూటింగ్ కు వెళ్లాలని చెప్పిన ప్రదీప్, బెడ్ రూంలోకి వెళ్లి తలుపు గడియపెట్టుకున్నాడు. ఉదయం షూటింగ్ కు సమయవుతోందంటూ భార్య తలుపు తట్టగా తీయలేదు.
అనుమానంతో తలుపులు పగులగొట్టగా చీరతో ఫ్యాన్ కు ఉరేసుకున్న ప్రదీప్ కనిపించాడు. విశాఖపట్టణానికి చెందిన శ్రవణ్...పావనికి స్నేహితుడు. అయితే ప్రదీప్ తో వివాహానికి శ్రవణే కారణం...వారి వివాహాన్ని దగ్గరుండి చేశాడు. వారిద్దరికీ శ్రవణ్ మంచి స్నేహితుడు. దీంతో ఖతార్ లో ఉద్యోగం చేసి, హైదరాబాదు వచ్చిన శ్రవణ్, ప్రదీప్ వారింట్లనో ఉంటున్నాడు. శ్రవణ్ కారణంగా వారి మధ్య ఎలాంటి విభేదాలు రాలేదని, వారి కుటుంబ సభ్యులు తెలిపారు. విచారణ అనంతరం పలువురిని ప్రశ్నించినా... పావని, ప్రదీప్, శ్రవణ్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నా ఎలాంటి అనుమానిత సమాచారం లభించలేదు. అలాగే పోస్టుమార్టం రిపోర్ట్ కూడా ప్రదీప్ ది ఆత్మహత్యే అని నిర్ధారించింది. దీంతో కేవలం మద్యం మత్తులో క్షణికావేశంతో ప్రదీప్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.