: రూటు మార్చిన ఉగ్రవాదులు.. ప్రస్తుత లక్ష్యం 'మిషన్ లూట్'

అనునిత్యం హత్యలతో రక్తపుటేరులు పారించే ఉగ్రవాదులు రూటు మార్చారు. ఇప్పుడంతా కేవలం దొంగతనాలు, దోపిడీలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఘటనలను చూస్తుంటే ఇదే అర్థమవుతోంది. ముఖానికి ముసుగులు వేసుకుని రావడం, బ్యాంకులను కొల్లగొట్టడమే లక్ష్యంగా వీరు దాడులకు తెగబడుతున్నారు. బుధవారం నాడు పుల్వామా జిల్లాలోని కాకపోరా ప్రాంతంలో ఉన్న బ్యాంకుపై దాడి చేసి రూ. 3 లక్షలు ఎత్తుకుపోయారు. దీనికి రెండు గంటల ముందే వాహిబగ్ గ్రామంలో ఉన్న మరో బ్యాంకులో రూ. 5 లక్షలు దోచుకున్నారు. ఇదే విధంగా మంగళవారం నాడు యారిపోరా బ్రాంచ్ లో రూ. 65 వేలు ఎత్తుకెళ్లారు. మే1వ తేదీన జమ్ముకశ్మీర్ బ్యాంక్ వ్యానుపై దాడి చేసి ఐదుగురు పోలీసులు, ఇద్దరు బ్యాంకు గార్డులకు కాల్చి చంపి సొమ్మంతా కొల్లగొట్టారు.

ఈ నేపథ్యంలో, ఉగ్రవాదుల ప్రస్తుత లక్ష్యం డబ్బును కూడబెట్టడమే అని అర్థమవుతోంది. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత పాత నోట్లు చెల్లకపోవడంతో... ఉగ్రవాదులకు ఆర్థిక సమస్యలు తలెత్తాయి. కనీస అవసరాలు కూడా తీరని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో, డబ్బు కోసం ఉగ్రవాదులు దోపిడీ బాట పట్టినట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి 'మిషన్ లూట్' అనే పేరు పెట్టినట్టు సమాచారం.

More Telugu News