: రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి వైసీపీ నేతలు ఎన్ని చేయాలో అన్నీ చేశారు!: సీఎం చంద్రబాబు
తాను మొదటి నుంచి అమరావతిలో సింగపూర్ లాంటి మంచి సిటీని నిర్మించుకుందామని చెబుతున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు మంత్రివర్గ సమావేశం జరిగిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమయ్యే ల్యాండ్ పూలింగ్‌ను తీసుకొచ్చామని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణానికి అందరూ కలిసి రావాలని తాను అన్నానని చెప్పారు. ఇది మంచి పని అని ప్రజలు తనను నమ్మి, 33,000 ఎకరాల ల్యాండ్ ఇచ్చారని చెప్పారు. తాను సింగపూర్ ప్రభుత్వాన్ని కోరగానే మాస్టర్ డెవలప్ మెంట్ ప్లాన్ తయారు చేసి ఇచ్చిందని అన్నారు. అక్కడి నుంచి ప్రజల్లో రాజధానిపై ఆశలు చిగురించాయని చెప్పారు.
కాగా, వైసీపీ తమపై మొదటి నుంచి ఎన్నో అవినీతి ఆరోపణలు చేస్తోందని చంద్రబాబు అన్నారు. రాజధాని నిర్మాణంలో అవినీతి జరిగిపోతోందని ఆరోపణలు గుప్పిస్తోందని అన్నారు. వైసీపీ నేతలు రాజధాని నిర్మాణానికి అడ్డుపడడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలూ చేశారని, కోర్టులకి కూడా వెళ్లారని, రైతులను రెచ్చగొట్టారని అన్నారు. అయినప్పటికీ తాము వెనకడుగు వేయలేదని చెప్పారు.