: లాడెన్ ను అలా చంపేశాను...రెండే బుల్లెట్లు...తుపాకీ పైకెత్తి అతని చిన్న భార్యకు తగలకుండా కాల్చేశా!: అమెరికన్ సీల్ రాబర్ట్ ఒనీల్
'అవును, ఒసామా బిన్ లాడెన్ ను కాల్చింది నేనే' అని 2014లో ప్రకటించిన అమెరికన్ సీల్ రాబర్ట్ ఒనీల్ ఆ నాటి ఘటనపై తన బయోగ్రఫీలో పేర్కొన్నాడు. లాడెన్ పై జరిగిన దాడిని కళ్లకు కట్టాడు. ఆ వివరాల్లోకి వెళ్తే...ఉగ్రవాదుల ఏరివేతకు సంబంధించి 400కు పైగా ఆపరేషన్లలో తాను పాల్గొన్నానని రాబర్ట్ ఒనీల్ తెలిపాడు. అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ ను హతమార్చేందుకు ఎంపిక చేసిన బృందంలో తాను కూడా ఉన్నానని చెప్పాడు.
పాకిస్థాన్ లోని అబోటాబాద్ లోని ఓ ఇంట్లో ఒసామాబిన్ లాడెన్ నక్కినట్లు సమాచారం అందిందని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆపరేషన్ లో పాల్గొనే ముందు తనలో చాలా భావాలు చెలరేగాయని ఆయన పేర్కొన్నారు. "అక్కడికెళ్లి లాడెన్‌ను చంపగలమా.. మేమే చనిపోతామా! ఏదైనా జరగొచ్చు. లాడెన్ ఆ ఇంట్లోనే ఉన్నట్లు పక్కాగా తెలుస్తోంది. ఆ ఇంటి చుట్టూ భారీ ప్రహరీ! ఎక్కడ, ఎవరుంటారు? వెళ్లగానే ఏం చేయాలి? ఎలా చేయాలి? అనే అన్ని అంశాలపై పకడ్బందీగా మా టీం సిద్ధమైంది. పూర్తి సన్నద్ధంగా ఆపరేషన్ ప్రారంభించాం. మా దళాలు కాంపౌండ్ వాల్ ను దాటుకుని లోపలికి ప్రవేశించాయి.
అక్కడ లాడెన్ కు అనేక అంచెలుగా రక్షణ వ్యవస్థ ఉంది. ఒక్కో అంచెను ఛేదిస్తూ చివరి అంచె వరకు చేరుకున్నాం. అక్కడ ఎదురైన లాడెన్ రక్షకులను చంపేశాం. చివరగా ఓ ఇనుప గేట్ ఎదురైంది. దానిని దాటేస్తే మా లక్ష్యం నెరవేరుతుంది. లాడెన్ కనిపించడం ఖాయం. ఆ ఆలోచనతోనే ఇనుప గేటును పేల్చేశాం...లాడెన్ కనిపిస్తాడనుకుంటే...పెద్ద గోడ కన్పించింది. దీంతో ఆశ్చర్యపోయాం. మా వాళ్లు దీనిని చూసి నిరాశ చెందారు. వెంటనే ‘శత్రువులను’ తప్పుదారి పట్టించేందుకే లాడెన్ ఆ ఇనుప గేటు ఏర్పాటు చేశాడని అర్థం చేసుకున్నాం. ఇలాంటి వ్యూహాత్మక ఏర్పాటు ఉందంటే లాడెన్ అక్కడే ఉన్నాడని నిర్ధారించుకున్నాం...దీంతో ఆ గోడను దాటి లోపలికి వెళ్లేందుకు సిద్ధమయ్యాం.
ఆ సమయంలో మా అందర్లో ఒకటే ఆలోచన...లాడెన్ కు, మాకు మధ్య ఒకే ఒక్క అడుగు. లోపలికెళ్లిన తరువాత మనం లాడెన్ ను చంపొచ్చు. లేదా లాడెన్ బలగాల చేతిలో మనమే చావొచ్చు. ఏది జరిగినా చరిత్ర సృష్టించినట్టేనని సర్దిచెప్పుకున్నాం... సాహసంతో ఒక్కో గదిని దాటాం... ఆ గదుల్లో మహిళలు, పిల్లలూ ఉన్నారు. వాళ్లెవరు? అన్నది కూడా తెలియదు...గదిలో అడుగుపెట్టడం...నిశ్శబ్దంగా ఉండాలని సైగ చేయడం.. గదిని పరిశీలనగా చూడడం..ఇదే మా పని...ఇంతకీ లాడెన్ ఏ గదిలో ఉన్నాడో మాకు అర్ధం కాలేదు...మాకు సమాచారం అందించిన మహిళ...ముందుగా ఖలీద్‌ను గుర్తించాలని చెప్పింది. లాడెన్ కు ఇష్టుడైన 23 ఏళ్ల నవ యువకుడు ఖలీద్....చురుగ్గా ఉంటాడు... ఖలీద్ కనిపించాడంటే ఆపై అంతస్తులో లాడెన్ ఉన్నట్లే...అని ఆమె చెప్పింది.
మరి ఖలీద్ ను గుర్తించడం ఎలా? ఖలీద్ కు సంబంధించిన ఏ సమాచారమూ ఎవరి వద్దా లేదు... అయితే, మా టీంలోని ఒక సభ్యుడు ఉర్దూ, అరబ్బీ రెండూ ప్రాక్టీస్ చేసినవాడున్నాడు. అక్కడ అతన్ని వాడాం. ‘ఖలీద్.. ఇలారా’ ఈ రెండు పదాలే పలకాలి... అవి కూడా అత్యంత సహజంగా ఉండాలి... బాగా తెలిసిన వాళ్లు పిలిచినంతగా బాగా పిలవాలి... వాతావరణం ఫుల్ టెన్షన్ గా ఉంది...అలాంటి చోట అంత సహజంగా ఉంటుందా? అన్న డౌటు కూడా రాలేదు...ఇంతలో మా బృందం సభ్యుడు ‘ఖలీద్ ఇలా రా’ అని చిన్నగా పిలిచాడు. దీంతో పిలుపు వినగానే ఖలీద్ తల మాత్రమే బైటకి పెట్టి ‘క్యా హై!’ అన్నాడు. అంతే ఒక్క సెకండ్ ఆలస్యం చేయకుండా అతని తలలోకి బుల్లెట్ దించేశాం. ఖలీద్ ఖేల్ ఖతం.
ఖలీద్ అక్కడున్నాడంటే పైఅంతస్తులో లాడెన్ ఉన్నట్లేనని నిర్ధారించుకున్నాం. చకచకా ఒక్కోమెట్టు ఎక్కుతూ పైఅంతస్తులోకి వెళ్లాం. ఇద్దరు మహిళలు ఎదురయ్యారు. వాళ్లు మానవ బాంబులు కావొచ్చన్న అనుమానంతో మా వాళ్లలో ఒకడు ‘హీరో’లా వాళ్ల మీదికి దూకాడు. అలా ఎందుకు చేశాడంటే... లాడెన్ కు అంత దగ్గరగా ఉన్నారంటే.. వాళ్లు మానవ బాంబులేనని...వారు తమను తాము పేల్చుకున్నా...ఆ పేలుడు తీవ్రత ఆ ఒక్కడిపైనే పడుతుందని, మిగిలిన వాళ్లంతా ప్రాణాలు కాపాడుకోవచ్చని ఆలోచించాడు. అయితే వారు మానవ బాంబులు కాదు. దీంతో ఎలాంటి పేలుడు సంభవించలేదు. ఆ తరువాత ఓ గదిలో అడుగుపెట్టగానే ‘టార్గెట్’ కనిపించింది.
పదేళ్లుగా వెతుకుతున్న లాడెన్ కళ్లముందు కనిపించాడు. నేను ఊహించినదానికంటే ఎత్తుగా, బక్కపలచగా ఉన్నాడు. అతని గడ్డం ఫొటోల్లో కనిపించినంత పొడవుగా లేదు. ఆ గది చీకటిగా ఉంది...మసక వెలుతురులో లాడెన్ ఓ మహిళ (అతడి చిన్న భార్య)తో కనిపించాడు. దీంతో నేను లాడెన్ వైపు ఏకే-47 ఎక్కుపెట్టాను. వెంటనే అతనిని కాపాడేందుకు ఆ మహిళ రైఫిల్ కు అడ్డం వచ్చింది. దీంతో ఆమెకు బుల్లెట్ తగలకుండా రైఫిల్ ను పైకి లేపి, టపాటపా అంటూ రెండు సార్లు కాల్చాను...అంతే లాడెన్ తలలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లడం...కుప్పకూలడం జరిగిపోయింది. దీంతో మిషన్ కంప్లీట్’’ తరువాత లాడెన్ శవాన్ని తీసుకుని హెలికాప్టర్ లో బయల్దేరాము...అంటూ లాడెన్ పై జరిగిన దాడిని రాబర్ట్ ఒనీల్ వివరించాడు.