: మహారాష్ట్రలో మహిళా ఆటో డ్రైవర్లతో అసభ్యంగా మాట్లాడుతున్న మగ డ్రైవర్లు!
మహారాష్ట్రలోని థానేలో ఆటోలు నడిపే మహిళా డ్రైవర్లకు మగ డ్రైవర్ల నుంచి వేధింపులు తప్పట్లేదు. థానే వ్యాప్తంగా సుమారు 150 మంది మహిళా ఆటోడ్రైవర్లు ఉంటారు. వీరిలో చాలా మంది మగ డ్రైవర్ల వేధింపులకు, సూటిపోటి మాటలకు బలవుతున్నవారే. అంతేకాదు, లైంగిక వేధింపులూ తప్పట్లేదు. ఇందుకు నిదర్శనం ఆరుగురు మహిళా డ్రైవర్లు చేసిన ఫిర్యాదులే. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, థానేలో మొట్టమొదటి మహిళా ఆటోడ్రైవర్ అనామిక అవినాష్ భాలే రావు(42) కూడా ఈ ఫిర్యాదు చేసిన వారిలో ఉండటం.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘ఒకవేళ ట్రాఫిక్ నిబంధనలు మేము ఉల్లంఘించిన సమయంలో ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వసూలు చేస్తారు. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు మాతో ఏమంటారంటే.. ‘మీకు లవ్ లెటర్’’ అని అంటారు అని చెప్పింది. మరో మహిళా డ్రైవర్ మనీషా రవీంద్ర కోహ్లీ (32) మాట్లాడుతూ, ‘మగ ఆటో డ్రైవరు ఒకడు ఏమన్నాడంటే.. దందా చేసుకోవాలనుకుంటే.. వేశ్యలు ఎక్కడ ఉంటారో, అక్కడికి నువ్వు వెళ్లు’ అంటూ ఇబ్బందికర వ్యాఖ్యలు చేశాడని వాపోయింది.
కాగా, పోటీ నేపథ్యంలోమగ ఆటో డ్రైవర్లు తీసుకునే ఆటో చార్జీలకు భిన్నంగా మహిళా ఆటో డ్రైవర్లు తీసుకుంటూ ఉంటారని స్థానిక రిక్షా, ట్యాక్సీ స్టాండ్ యూనియన్ కు చెందిన వ్యక్తులు ఆరోపించారు. మగ ఆటో డ్రైవర్లలా రాత్రి పదకొండు గంటల వరకు ఆటోలు నడుపుతుంటారని, సాయంత్రం ఆరు గంటల తర్వాత వారిని అనుమతించకూడదని అన్నారు. అయితే, ఈ విషయాన్ని మహిళా ఆటోడ్రైవర్ మనీషా ఖండించింది. మగాళ్లు భయం లేకుండా ఆటోలు నడుపుతున్నప్పుడు తాము మాత్రం ఎందుకు భయపడాలని ప్రశ్నించింది. మహిళలు విమానాలను సైతం నడుపుతున్నారని .. ఆటోలు నడిపితే సమస్య ఏంటని ప్రశ్నించింది.