: పెంపుడు కుక్కే పులిలా విరుచుకుపడి చంపేసింది!
పెంపుడు కుక్కే పులిలా విరుచుకుపడి ఓ వ్యక్తిని చంపేసిన ఘటన హర్యానాలోని పానిపట్ జిల్లాలోని బల్హేరీ గ్రామంలో చోటు చేసుకుంది. రోట్ వీలర్ జాతికి చెందిన ఓ కుక్కను సుమారు ఏడాది కాలంగా హర్దీప్ సింగ్ అనే వ్యక్తి తన ఫామ్ హౌస్‌లో పెంచుకుంటున్నాడు. ఆ ఫామ్ హౌస్ వాచ్‌మెన్ మణిరామ్ అనే 52 ఏళ్ల వ్యక్తి కూడా ఆ కుక్క బాగోగులు చూసుకుంటున్నాడు. హర్దీప్ సింగ్, మణిరామ్ ఏడాదిగా ఆ ఫామ్ హౌస్‌లోనే నివసిస్తున్నారు. అయితే, నిన్న గొలుసును విప్పిన మణిరామ్‌పై ఒక్కసారిగా ఆ కుక్క దాడి చేసింది. ఎంతకీ వదలలేదు ఫామ్ హౌస్‌లో పనికి వచ్చిన వారు కూడా కుక్కను తరమడానికి ప్రయత్నించారు.
అయినా కుక్క మణిరామ్‌పై దాడి ఆపకపోవడంతో వారంతా పోలీసులకు సమాచారం అందించారు. అయితే, పోలీసులు అక్కడకు వచ్చేసరికి మణిరామ్ ప్రాణాలు కోల్పోయాడు. కుక్క అతడి శరీర భాగాలు తింటూ కనిపించింది. ఆ మృతదేహం దగ్గరికి ఎవ్వర్నీ రానివ్వలేదు. నాలుగు గంటలు శ్రమపడిన పోలీసులు చివరకు దాన్ని పట్టుకున్నారు. మణిరామ్ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.