: వారం రోజులు ముగిసినా తెలియని ఆచూకీ...ఆందోళనలో లిఖిత తల్లిదండ్రులు
గుంటూరు జిల్లా భట్టిప్రోలు గ్రామానికి చెందిన 13 ఏళ్ల లిఖిత కిడ్నాప్ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. గత నెల 22న భట్టిప్రోలు మండలం ఐలవరంలోని పాఠశాలకు వెళ్లిన లిఖిత తిరిగి ఇంటికి చేరలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు, లిఖితను కిడ్నాప్ చేసినట్టు గుర్తించారు.
ఈ నేపథ్యంలో అతనిపై నిఘా ఉంచారు. అయితే హైదరాబాదు నుంచి కోదాడ చేరుకున్న నాగేశ్వరరావు సెల్ ఫోన్ పని చేయడం లేదు. మరోపక్క, ఏపీ డీజీపీ సాంబశివరావు 24 గంటల్లో కేసు ఛేదించాలని ఆదేశించారు. దీంతో ఆటోడ్రైవర్ నాగేశ్వరరావు చిత్రాన్ని పత్రికలకు విడుదల చేశారు. గుంటూరు జోన్ ఐజీ సంజయ్ ఈ కేసును పర్యవేక్షిస్తున్నా ఎలాంటి పురోగతి లేకపోవడంతో లిఖిత తల్లిదండ్రులు క్షణం ఒక యుగంలా గడుపుతున్నారు.