: నా తొలి చిత్రం 'అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి' కాదు: పవన్ కల్యాణ్ వెల్లడించిన ఆసక్తికర విషయం
తన తొలి చిత్రం 'అక్కడ అమ్మాయి - ఇక్కడ అబ్బాయి' అని అందరూ అనుకుంటారని, కానీ, అందుకు ఎన్నో ఏళ్ల ముందే దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్ తీసిన 'శుభలేఖ' సినిమాతో తన తెరంగేట్రం జరిగిపోయిందని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ గమ్మత్తైన అంశాన్ని అభిమానుల ముందుకు తెచ్చారు.
"మద్రాసు టీ నగర్, పోరూరు సోమసుందరం వీధిలో అన్నయ్య వాళ్ల ఇల్లు ఉండేదని అందరికీ తెలుసుగా. దానికి ఎదురుగానే విజయనిర్మల గారి ఇల్లు ఉండేది. ఆ పక్క సందులోనే వాళ్ల డబ్బింగ్ థియేటర్ ఉంది. అందులో విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అన్నయ్య తొలిసారిగా నటించిన 'శుభలేఖ' సినిమా డబ్బింగ్ జరుగుతోంది. అప్పట్లో నాకు పదహారేళ్ళు ఉంటాయనుకుంటా. చదువుకుంటున్నా. ఇంటి పక్కనే కదా అని అన్నయ్యకు టీ ఇవ్వడానికి డబ్బింగ్ థియేటర్ కి వెళ్లాను. ఆ సినిమాలో అన్నయ్య సర్వర్ గా పనిచేసే పాత్రలో నటించారు. ఏదో హోటల్ సీన్ కు డబ్బింగ్ జరుగుతూ ఉన్న సమయంలో నేను వెళ్లాను. నన్ను చూసిన, ఆ సినిమా నిర్మాత వి.వి.శాస్త్రి, 'ఈ డబ్బింగ్ చెప్పరా' అంటూ 'మంచినీళ్ళు ఎక్కడ సార్?' అనే చిన్న డైలాగ్ ఇచ్చారు. నేనూ చెప్పేశాను. ఇప్పటికీ 'శుభలేఖ' సినిమాలో నా గొంతులో ఆ డైలాగ్ వినచ్చు. అదే నా తొలి పరిచయం. ఒక రకంగా చెప్పాలంటే, విశ్వనాథ్ గారి సినిమాతోనే నా రంగప్రవేశం జరిగిందనుకోవచ్చు" అంటూ పవన్ వెల్లడించారు.