: మానవ హక్కుల బృందానికి తొలిసారి అనుమతినిచ్చిన ఉత్తరకొరియా
ప్రపంచం నివ్వెరపోయే నిర్ణయాన్ని డెమోక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (డీపీఆర్కే) తీసుకుంది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని మానవ హక్కుల బృందాన్ని తమ దేశ పర్యటనకు అనుమతిస్తూ ఉత్తర కొరియా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగం ప్రకటన విడుదల చేసింది. దీంతో కేటలినా డివన్ డాస్ అగిలర్ నేతృత్వంలోని హక్కుల బృందం ఉత్తర కొరియాలో వివిధ కారణాలతో వైకల్యం పొందిన పౌరుల స్థితిగతులపై అధ్యయనం చేయనుంది. ఆరు రోజుల పాటు జరగనున్న ఈ పర్యటనలో విశేషాలను చివరిరోజు ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్ యాంగ్ లో ఆమె వెల్లడించనున్నారు.
కేవలం మానవ హక్కులనే కాకుండా, అక్కడి పరిస్థితులను కూడా అంచనా వేయడానికి ఇదో సువర్ణావకాశమని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా, అంతర్జాతీయ స్థాయిలో ఓ పౌర హక్కుల సంఘాన్ని తమ దేశ పర్యటనకు అనుమతించడం ఉత్తరకొరియా చరిత్రలో ఇదే తొలిసారి. ఇంతవరకు ఆ దేశంలో పౌర హక్కుల సంఘాలేవీ పర్యటించలేదు. యూఎన్ గణాంకాల ప్రకారం ఉత్తర కొరియా లక్షా ఇరవై వేల మంది ఖైదీలను సైనిక శిబిరాల్లో క్రూరంగా హింసించినట్టు అంచనా.