: ఏపీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలి: ఎమ్మెల్యే కృష్ణయ్య డిమాండ్
వచ్చే నెలలో నిర్వహించనున్న ఏపీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్యను పెంచాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు నీల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట నిరుద్యోగులు ఈ రోజు ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా విచ్చేసిన కృష్ణయ్య మాట్లాడుతూ, గ్రూప్-2లో నాలుగు వేల ఖాళీలు ఉండగా, కేవలం 900 పోస్టులు భర్తీ చేస్తే సరిపోదని అన్నారు. గ్రూప్-2 ప్రిలిమ్స్ అనంతరం నిర్వహించే మెయిన్స్ కు ఐదు నెలల సమయం ఇస్తారని, ఈసారి మాత్రం కేవలం 45 రోజులు మాత్రమే ఇచ్చారని అన్నారు. మెయిన్స్ కు ప్రిపేర్ అయ్యేందుకు ఈ సమయం చాలదని, ప్రిపేర్ అవడం కష్టమని, ఆన్ లైన్ పరీక్షా విధానం కారణంగా గ్రామీణ విద్యార్థులు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని అన్నారు. అనంతరం, ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఈ మేరకు ఓ వినతి పత్రం సమర్పించారు.