: అలా అన్నవారే ఇప్పుడు కనిపించకుండా పోయారు!: సీఎం కేసీఆర్
వరంగల్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి నిర్వహిస్తోన్న భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. తనకు వరంగల్ మైదానంలో మాట్లాడుతోంటే కొంత సంతోషంగా.. కొంత బాధగా ఉందని అన్నారు. గతంలో ఇదే మైదానంలో ఎన్నో సభలు నిర్వహించామని ఆయన అన్నారు. ఈ మైదానంలో ప్రొ.జయశంకర్ ముందు మాట్లాడాక, ఆ తరువాత తాను మాట్లాడేవాడినని అన్నారు. ఇదే ఓరుగల్లు వేదికగా ఎన్నో ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లామని, పోరాటాలు చేశామని ఆయన అన్నారు. ఓరుగల్లు పోరుగల్లు నిజమేకదా? అని కేసీఆర్ అన్నారు.
ఇక, తమ పార్టీ ప్రారంభమైనప్పుడు ఇది ఉంటదా? నిలబడుతదా? అని కొందరు అన్నారని, అలా అన్నవారే ఇప్పుడు కనిపించకుండా పోయారని, కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎక్కడికీ పోలేదని కేసీఆర్ అన్నారు. ఈ రోజు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా దూసుకుపోతోందని, అన్ని వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. మూడేళ్ల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని అన్నారు. ఎండకు భయపడకుండా ఈ రోజు లక్షల మంది ప్రజలు వరంగల్ వచ్చారని, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.